AP CM CHANDRA BABU | పేదల ఆదాయం పెంచుతాం.. ఆనందాన్ని పంచుతాం
*సంక్షేమం అమలులో ఏపీకి దరిదాపుల్లో ఏ రాష్ట్రం రాదు
*మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ
*చెత్త విషయంలో జపాన్ తరహాలో అలవాట్లు మార్చుకోవాలి
*వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
VikasamNews/Hyderabad : పేదల ఆదాయాన్ని పెంచి వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతామని.. ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
వినుకొండలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పౌరుషాల గడ్డ పల్నాడులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పల్నాడులో అడుగుపెడితే వచ్చే వైబ్రేషనే వేరుగా ఉంటుంది. ఇటీవల కోటప్పకొండలో శివరాత్రి ఉత్సాహంగా జరిగింది. భక్తులతో దద్దరిల్లింది. కోటప్పకొండ తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి ప్రభలు అంటే కోటప్పకొండ ప్రభలే గుర్తుకు వస్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయి. నేను గతంలో ముఖ్యమంత్రిగా పచ్చదనం – పరిశుభ్రత, నీరు – మీరు, ఆకస్మిక తనిఖీలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. స్వచ్ఛాంధ్ర అంటే రోడ్లు ఊడ్చే కార్యక్రమం కాదు. స్వచ్ఛత మన జీవిన విధానంలో భాగం కావాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
‘రాష్ట్రంలోని ప్రతి మండలానికో స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నాం. వారానికోసారి రథాలు గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికి రాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. అన్నింటికంటే మనకు ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పరిసరాలు, శుభ్రమైన కార్యాలయాలు, గ్రామాలు ఉండాలి. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. వర్షాలకు ఆ చెత్త భూమిలో ఇంకి తద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది. నూటికి 97 శాతం మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. వచ్చే నెల కల్లా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 100 శాతం ఇంటింటికీ చెత్త సేకరిస్తాం. రాష్ట్రంలో 4,14,004 కుటుంబాలు హోం కంపోస్టింగ్ చేస్తున్నారు. 4,19,288 టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరులో రూ.1,254 కోట్లతో పీపీపీ విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తీసుకువస్తాం’అని సీఎం చంద్రబాబు తెలిపారు.
‘రాష్ట్రంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించాం. ప్లాస్టిక్ వల్ల ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించటం, విద్యుత్ ఉత్పత్తి లాంటివి చేస్తున్నాం. చెత్త సేకరణ కోసం ట్రై సైకిళ్లు, ఈ-ఆటోలు, వివిధ యంత్రాలను వినియోగిస్తున్నాం. విశాఖ, గుంటూరులలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. రాజమండ్రి సహా మరో 5 ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేందుకు చర్యలు చేపడతాం. చెత్త, వ్యర్ధాల నిర్వహణలో మన ఆలోచనా తీరు మారాలి. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి సంక్రమిత వ్యాధులు తడి వ్యర్ధాల కారణంగానే వస్తున్నాయి. జపాన్ లో రోడ్లపై చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు. అక్కడి పౌరుల తరహాలో మనమూ కొన్ని అలవాట్లను మార్చుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
‘రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పెను మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నాం. నేను స్వయంగా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంలో దేశంలోని మరే రాష్ట్రంలోనూ మన దరిదాపుల్లో లేదు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలకు మెరుగైన ఆరోగ్యసేవలు అందిస్తాం. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. గిట్టుబాటు ధర వచ్చే పంటలనే రైతులు వేయాలని కోరుతున్నాను. వారసత్వంగా వచ్చే పంటలనే పండిస్తే ఆదాయం తక్కువ వచ్చి ఇబ్బందులు వస్తాయి. రైతుకు టెక్నాలజీ అలవాటు చేస్తున్నాం.
ఏఐ ద్వారా వ్యవసాయ నిపుణుణ్ని అందుబాటులోకి తెచ్చి రైతుకు శిక్షణ అందిస్తాం. ఇటీవల బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మనవాళ్ల టెక్నాలజీ వినియోగాన్ని మెచ్చుకున్నారు. మైక్రో ఇరిగేషన్‌లో దేశంలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తున్నాం. అందులో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మొదట్నుంచీ డ్వాక్రా మహిళలు నాకు అండగా ఉన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తయారుచేసే బాధ్యత తీసుకున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
‘సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే పీ4 కింద లక్షమంది మార్గదర్శులు… 10 లక్షల మంది పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అట్టడుగున ఉండే 20 శాతం బంగారు కుటుంబాలు, పైన ఉండే 10 శాతం మార్గదర్శులు కలిసి పనిచేస్తే రేపటి రోజున ఈ బంగారు కుటుంబాలే మార్గదర్శులు అవుతారు. పీ4 ద్వారా 100 కుటుంబాలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుని అభినందిస్తున్నాను. ఈ పథకం ద్వారా మరింతమంది పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు మరికొందరు ముందుకు రావాలి’ అని సీఎం చంద్రబాబు కోరారు.
వ్యర్ధాల సేకరణ కోసం వినియోగించే స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు. దాచేపల్లికి చెందిన స్వచ్ఛ రథం డ్రైవర్ దుర్గారావు, హోం కంపోస్టింగ్ విభాగంలో లక్ష్మీ గోవిందమ్మను ముఖ్యమంత్రి సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
* * *


