Ex Ministar HarishRao | బడికి తాళంపెట్టి.. రోడ్డుపై పసిపిల్లకు పాఠాలు..
*కాంగ్రెస్ మార్కు ప్రజాపాలనలో విద్యావ్యవస్థ దయనీయ స్థితికి ఇదే సజీవ సాక్ష్యం.
*మాజీ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు
Vikasamnews/Hyderabad : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేశాడు అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసిపిల్లలు.. శనివారం రోడ్డు మీద కూర్చుని ‘వియ్ వాంట్ జస్టిస్’ అని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదా ? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. విద్యాశాఖ నిర్వహణ మరెవ్వరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నాను అంటూ.. పదేపదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలి అని విమర్శించారు. వరుసగా విద్యాశాఖకు సంబంధించి జరగకూడని ఘోరాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు? అని ప్రశ్నించారు. ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే.. తప్పుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
సుమారు రూ. 100 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రూ. 4.5 కోట్లతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి మూడో క్యాంప్ కార్యాలయం కట్టడానికి నిధులుంటాయి కానీ.. బడి పిల్లలు చదువుకునే పాఠశాలకు అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు లేవా? అని నిలదీశారు. 5000 కోట్లతో మూసీలో ‘గాంధీ సరోవర్’ కడతామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి.. బడి అద్దె కట్టేందుకు,నాణ్యమైన భోజనం పెట్టేందుకు చేతులు రావడం లేదా? అని ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు చేసి పెట్టే విగ్రహాలకు సామాన్య ప్రజల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేయడం, బడికి అద్దె కట్టక విద్యార్థులను నడిరోడ్డున పడేయడం, ఈ విధ్వంసక పాలన మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి ? అని ఆగ్రహించారు.
* * *


