Friday, March 14, 2025

Telangana BhuBharathi New Rules | భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు

Telangana BhuBharathi New Rules | భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు
తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా భూభార‌తి చ‌ట్టం చేశాం
విధివిధానాలపై కలెక్టర్లతో వర్క్ షాప్
పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
Hyderabad : ప్ర‌జాస్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు పెట్టి ఆ త‌ర్వాత మేధావులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని దేశానికి ఆద‌ర్శంగా ఉండేలా భూ భార‌తి ఆర్వోఆర్ 2025 చట్టాన్ని తీసుకువచ్చామని, అదే స్ఫూర్తితో ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాల‌ను రూపొందిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ‌ ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌జానీకానికి మెరుగైన‌, స‌మ‌గ్ర‌మైన రెవెన్యూ సేవ‌లను స‌త్వ‌ర‌మే అందించాల‌న్న ఆశ‌యంతో, విస్తృత స్థాయిలో అభిప్రాయాలను సేకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామ‌న్నారు. భూభార‌తి చ‌ట్టం రూప‌క‌ల్ప‌న‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డామో ఈ చ‌ట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను త‌యారు చేయ‌డానికి కూడా అదే స్థాయిలో క‌స‌ర‌త్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా, చిన్న చిన్న తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా విధివిధానాలను రూపొందించాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాలను రూపొందించడంపై హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ఆర్డి లో క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో తొలి రోజు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. “ఎలాంటి విధి విధానాలు త‌యారు చేయ‌కుండానే 2020 ఆర్వోఆర్ చ‌ట్టాన్ని ఆనాటి ప్ర‌భుత్వం అమలులోకి తీసుకురావ‌డంతో ఎదురైన ప్ర‌తికూల ప‌రిస్ధితులు మ‌న క‌ళ్ల‌ముందే క‌నిపిస్తున్నాయి. ఆనాటి పాలకులు గొప్పగా చెప్పుకున్న ధరణిలో అన్ని లొసుగులు, లోపాలే. నిబంధ‌న‌ల రూప‌క‌ల్ప‌న లేకుండానే అమ‌లులోకి తీసుకువ‌చ్చిన 2020 ఆర్‌ఓ‌ఆర్ చ‌ట్టం వ‌ల్లే ల‌క్ష‌లాది మంది రైతులు రోడ్డున ప‌డ్డారు. చ‌ట్టం తీసుకువచ్చి మూడు సంవత్స‌రాలు గ‌డ‌చినా కూడా ఆనాటి ప్రభుత్వం విధివిధానాల‌ను రూపొందించ‌లేదు. స‌చివాల‌యంలో కూర్చొని రూల్స్ రూపొందించ‌కుండా విస్తృత స్దాయిలో అధికారులు, మేధావులు, అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని అంద‌రి అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ప‌క‌డ్బందీగా భూ భార‌తి విధివిధానాలు త‌యారు చేస్తున్నాం. వీలైనంత త్వ‌రగా భూభార‌తి చ‌ట్టానికి సంబంధించిన విధివిధానాల‌ను త‌యారుచేసి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువస్తాం. కొత్త స‌మ‌స్య‌లు రాకుండా ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేలా రైతుల‌కు ప్ర‌యోజ‌నం కలిగేలా, అధికారులు త‌ప్పుచేయ‌డానికి ఆస్కారం లేకుండా విధివిధానాల‌ను రూపొందిస్తున్నాం. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి భూ పరిపాలనలో పెను మార్పులను తీసుకురాబోతుంది. భూ హ‌క్కుల‌ను ర‌క్షించ‌డం, భూ వ్య‌వ‌హారాల‌లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకురావ‌డం, భూ లావాదేవీల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డం, సామాన్యుల‌కు సైతం రెవెన్యూ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం ఈ చ‌ట్టం ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ చ‌ట్టం త‌ర‌త‌రాల భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతుంది. భ‌విష్య‌త్తులో మ‌రింత మెరుగైన విధానాలు, సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకొని భూ ప‌రిపాల‌న‌ను మ‌రింత స‌మ‌ర్ద‌వంతంగా కొన‌సాగిస్తాం. ఈ నూత‌న చ‌ట్టం ద్వారా భూ యాజ‌మాన్య హ‌క్కుల‌నే గాకుండా వారి జీవితాల‌ను ఆత్మ‌గౌర‌వాన్ని ఆర్ధిక స్వ‌తంత్య్రాన్ని తీసుకువ‌స్తుంది” అని అన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సి‌సి‌ఎల్‌ఏ పీడీ సి‌ఎం‌ఆర్‌ఓ మకరంద్, భూ చట్ట నిపుణులు భూమి సునిల్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు వివిధ జిల్లాల ఆర్‌డి‌ఓలు, తహసీల్దార్లు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles