Prime Minister Modi | ఊబకాయంపై పోరాటం చేద్దాం
వంట నూనెలు బాగా తగ్గించాలి
ఊబకాయంపై ప్రజల్లో అవగాహనకు 10 మంది ప్రముఖులు నియామకం
మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోడి వెల్లడి
Hyderabad : భారత దేశంలో ఊబకాయం (Obesity) వారి సంఖ్య బాగా పెరుగుతుందని, ఇది తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఊబకాయం సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని ప్రజలకు సూచించారు. అయితే ఊబకాయం సమస్య గురించి ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో చర్చించారు.
ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని నామినేట్ చేశారు. దేశంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో ఊబకాయం కేసులు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమన్నారు. ‘ఫిట్ అండ్ హెల్తీ దేశంగా మారాలంటే.. మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. గత కొన్నేళ్లుగా ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. పిల్లల్లో ఊబకాయ సమస్య నాలుగు రెట్లు పెరిగింది. మరింత ఆందోళనకర విషయం’ అని ప్రధాని మోదీ ఆదేవన తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇది చాలా ఆందోళనకర అంశమని ప్రధాని పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలని సూచించారు. ప్రజల్లో ఊబకాయంపై అవగాహన కలిగించడానికి 10 మంది ముఖ్యులను ప్రధాని నియమించారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని నియమించిన వారిలో ఉన్నారు.
* * *