TGPSC Group1 Results Out | ఎట్టకేలకు గ్రూప్-1 ఫలితాలు విడుదల
వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ మార్కులు జాబితా
ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం
రీకౌంటింగ్ కోసం ఈ నెల 24 వరకు గడువు
Hyderabad : రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అందుకు సంబంధించిన ప్రొవిజనల్ మార్కుల జాబితా వెల్లడించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్- 1 మార్కుల జాబితా పొందుపరిచారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో మార్కులు తెలుసుకోవచ్చు. గ్రూప్-1 మార్కుల జాబితాను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశ్వ తన ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ సభ్యులతో పాటు సెక్రెటరీ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అర్హత సాధించగా.. వారిలో 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాదాపు ఐదు నెలల తర్వాత మెయిన్స్ ఫలితాలు విడుదల చేశారు. అయితే అనేక కోర్టు కేసులు, లిటిగేషన్ల నడుమ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేయడం, మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే గ్రూప్-1పై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసులు నమోదయ్యాయి. అయినా వాటిని అధిగమించిన టీజీపీఎస్సీ ఎట్టకేలకు ఫలితాలు విడుదల చేయడంతో నిరుద్యోగులు, తల్లిదండ్రులలో సంతోషం వ్యక్తం అవుతుంది. అయితే రీకౌంటింగ్ కోసం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 వరకు గడువు విధించారు. రీ కౌంటింగ్ ఫీజు రూ.1000 నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం tgpsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
* * *