Mlc Kavita | కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌పై మండిపాటు
Hyderabad : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసిఆర్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగించిన భాషను తెలంగాణ సమాజమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, కాబట్టి తక్షణమే ఆయనకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హుందాగా రాజకీయాలు చేస్తుందని, ఈ క్రమంలో సీఎం రేవంత్ ప్రయోగించిన భాషను తాము ప్రయోగించలేమని, ఈ విషయంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం
శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఆ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. తెలంగాణ చరిత్రలో ఇది చీకటి రోజని స్పష్టం చేశారు. మహిళలను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూనే, తన ఇంట్లోని మహిళలను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూనే, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానని అంటూనే సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కేసీఆర్ గారితో పాటు తమ కుటుంబంలోని చంటి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు అవి తిరిగి సీఎంకే వస్తున్నాయని చెప్పారు. “మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లం. ఇవాళ ఏం చేస్తామో మళ్ళీ అది మనకు వాపస్ వస్తుంది. గత ఐదు ఆరు సంవత్సరాలలో వాళ్లు చేసిన పనే తిరిగి వాళ్లకు చుట్టుకుంటున్నది. అది ఎవరు చేయిస్తున్నది కాదు. “అని వ్యాఖ్యానించారు. మంత్రులు కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, సభలో ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి అని చాలా దురుసుగా, దురాహంకారం తోటి బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారని విమర్శించారు. ఇటువంటి అహంకార పూరితమైన వ్యాఖ్యలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, వారి గట్టిగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నదని ఆమె మండిపడ్డారు.
* * *