Telangana SSC Exams | రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
హాజరుకానున్న5.09 లక్షల విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా 2,650 కేంద్రాలలో పరీక్షలు
ఉదయం 9.30 నుంచి పరీక్షలు షురూ..
క్యూఆర్ కోడ్ విధానంలో తొలిసారిగా పది పరీక్షలు షురూ..
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 (రేపటి) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకు సంబంధించి పరీక్షల నిర్వహణ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కాంపోజిట్ పేపర్లకు పరీక్షరాసేవారికి మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం 5 నిమిషాల వరకు మాత్రమే పరీక్షలకు విద్యార్థులకు అనుమతిస్తామని పరీక్షల నియంత్రణ అధికారులు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన వివరాలు విద్యార్థులకు ఇచ్చిన సూచనలలో కూడా పొందుపరిచారు.
పరీక్షల హాల్‌టిక్కెట్లు ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ అవుతున్నాయి. అయితే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షలకు హాజరు కావచ్చని, వాటిని అనుమతిస్తామని పరీక్షల అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు. అందుకోసం 2,650 సెంటర్లను ఏర్పాటు చేశారు.
* పరీక్షల ఏర్పాట్లు ఇలా ఉన్నాయి..
పది పరీక్షలలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా 24 పేజీల బుక్‌లెట్‌ను విద్యార్థులకు ఇస్తున్నారు. ఆ పేజీల్లోనే విద్యార్థులు జవాబులు రాయాలి. ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రశ్నపత్రాలపై మొదటి సారిగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు.
మొదటి సారిగా ఒక్కొక్క పేపర్‌పై ఒక యూనిక్ నంబర్‌ను సైతం ముద్రించారు. ఈ యూనిక్ నంబర్ ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై ప్రింట్ చేశారు.
అలాగే సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. ఈ రెండింటికి మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకే పరీక్ష జరుగుతుంది. గణితం పరీక్ష రోజు గ్రాఫ్ పేపర్ విడిగా ఇస్తారు. సీఎస్‌డీవో గదుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిళ్లు తెరుస్తారు.
* * *