KTR- BRS | రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్న వరంగల్ సభ
పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న కేటీఆర్..
సభకు తరలివచ్చే ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం
తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా సభకు తరలిరావాలని పిలుపు
Hyderabad : రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్‌లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం ఆ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే ఆ పార్టీ నేతలకు దిశ నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు.. ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని కదలిరావాలని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన సభ ఇది అని, కాబట్టి ఈ సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలి రావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందని, వారందరినీ సమన్వయం చేసుకొని.. అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.
* వాహనానికి అన్ని వైపులా గులాబి జెండాలు ఉండాలి..
ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలను కట్టుకుని.. ఉత్సాహంగా బయలుదేరాలని కోరారు. ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు భోజన వసతికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా.. ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని తెలిపారు. దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభ స్థలికి చేరుకోవాలని తెలిపారు. సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలు నిలుపరాదని తెలిపారు. తమకు సూచించిన పార్కింగ్ స్థలాలకు నేరుగా చేరుకొని, అక్కడే వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. సభకు చేరుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఎక్కడికక్కడ మంచినీటి బాటిళ్లతోపాటు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రాత్మకమైన సభలో కేసిఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ర్ట రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.
* * *