Skill University | త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Hyderabad : రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అన్ని క్రీడల అభివృద్ధికి జిల్లాల వారిగా ప్రత్యేక అకాడెమీలు నెలకొల్పుతామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. క్రీడల్లో గ్రామీణ ప్రాంత యువత శిక్షణకు ప్రాధాన్యతనిచ్చేలా తనవంతు కృష్టి చేస్తానని ఆయన పేర్కొన్నారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని ఆయన అభిలషించారు. ఈ మేరకు శనివారం మినిష్టర్స్ క్వార్టర్స్ లో తనను కలిసిన తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన సలహాదారు కోసరాజు లక్ష్మణ్, మీడియా కో ఆర్డినేటర్ వెంకట రమణా రెడ్డిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలు అందజేసారు. బ్యాడ్మింటన్ క్రీడ మరింత విస్తరించేందుకు పాటు పడాలని తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన శ్రీధర్ బాబు వారికి దిశానిర్దేశం చేసారు. మంత్రిని కలిసిన వారిలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈవెంట్స్ అండ్ ప్రోటోకాల్ ప్రతినిధి యువిఎన్ బాబు తదితరులు ఉన్నారు.
* * *