LRS New Problems | ఎల్ఆర్ఎస్‌లో కొత్త సమస్యలు
ఆవేదన వ్యక్తం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
Hyderabad : ల్యాండ్ క్రమబద్ధీకరణ పథకంలో కొత్త సమస్యలు వచ్చాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కడితే 25 శాతం రాయితీ ఇస్తామన్న సర్కారు.. అది నమ్మి దరఖాస్తులు చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్ కడుదామనుకున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొండ నాలుకకు మందస్తే.. ఉన్న నాలుక ఊడినట్లయింది తమ పరిస్థితి అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక LRS కడితే 25% రాయితీ ఇస్తామని ప్రకటించింది. దరఖాస్దారులు ఎల్ఆర్ఎస్ చెల్లించడానికి వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా క్లియర్ గా ఉన్న ప్లాటు కూడా ఎఫ్ టీ ఎల్ అని, బఫర్ జోన్ అని, ప్రోహిబిటెడ్ లిస్టులో ప్రాపర్టీ చూపించటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ నుండి, ఇరిగేషన్ ఆఫీస్ నుండి, మున్సిపల్ ఆఫీసు నుంచి.. ఈ విధంగా అన్న శాఖల నుంచి ఎన్ఓసి తీసుకు వచ్చినా.. ఆ ప్రాపర్టీకి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఆయా కార్యాలయాల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కొక్క కార్యాలయం చుట్టూ కనీసం 15 రోజులు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా అమ్యామ్యాలు చెల్లిస్తే తప్ప.. ఎన్ ఓ సి రెవెన్యూ, ఇరిగేషన్, ము న్సిపాలిటీ డిపార్టుమెంట్‌ల నుంచి ఎన్‌వోసీలు రావడం లేదు.
ఈ తతంగం ముగిసిన తర్వాత కూడా ఎల్ఆర్ఎస్ ప్రోసిడింగ్ కాపీ వెంటనే కావాలంటే కనీసం రూ. 15 వేలు అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలల తరబడి. ఆయా కార్యాలయం చుట్టూ తిరగాలి.
ఇక రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ సిస్టం తీసుకు వస్తున్నామని, రెండు మూడు గంటలు పట్టే రిజిస్ట్రేషన్ కు 15 నిమిషాలలో పూర్తవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. వారు చెప్పినంత తేలికగా పని పూర్తికావడం లేదు. స్లాట్ బుకింగ్ విధానం తీసుకురావడం వలన కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ రెండు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరోజు స్లాట్ బుకింగ్ కోసం, మరొక రోజు రిజిస్ట్రేషన్ కోసం తిరిగే పరిస్థితి ఉంది. స్లాట్ బుకింగ్ విధానం అనేది సమస్యకు పరిష్కారం అసలే కాదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లలో మౌలిక వసతులు కల్పిస్తూ.. తగినంతగా ఉద్యోగులను నియమించాలి. కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులలో డాక్యుమెంట్ రైటర్లే అనేక పనులు చేస్తున్నారు. తొలుత వీటికి పరిష్కారం చూపించాలి.
* * *