Friday, March 14, 2025

Telangana Education | విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారాలి

Telangana Education | విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారాలి
స్కూళ్ల‌లో మౌలిక స‌దుపాయాలు మెరుగు ప‌రుచాలి
ఏఐ ని పాఠ్యాంశాల‌లో భాగం చేయాలి
విద్యా విధానంపై అధికారుల‌తో స‌మీక్షించిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు..
Hyderabad : రాష్ట్ర‌ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యాసంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నామని, దీనికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని శ్రీధర్ బాబు సూచించారు. “ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పరుచ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ చదువులను అందించాలని సిఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందుకు అనువైన పరిస్థితులను విద్యాశాఖ కల్పించాలి. గుజరాత్ నుంచి ఏటా 30- 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సింగపూర్ కు వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు. ఆ తరహా ప్రయత్నం మనవద్ద కూడా జరగాలి. ఫిన్లాండ్, ఫ్రాన్స్, యుకెలలోని విద్యాప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశ పెట్టాలి. పాఠ్యాంశాలను మార్చాలి. సింగపూర్ ప్రభుత్వం మన దగ్గర ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. త్వరలోనే సింగపూర్ బృందం పర్యటిస్తుంది. మన ఉపాధ్యాయులను కూడా ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది”. అయితే దానికి సంబంధించిన విధి విధానాలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. “వచ్చే 2-3 ఏళ్లలో మన విద్యావిధానంలో సమూల మార్పులు జరగాలి. విద్యపై ఎంతో ఖర్చు పెడుతున్న‌ప్ప‌టికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ళను పరిశీలించి అందులో మెరుగైన విధానాలను అమలు చేసే విషయం పరిశీలించాలి“ అని శ్రీధర్ బాబు ఆదేశించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సును కర్రికులమ్ లో భాగం చేయాలి..
“కింది తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలి. హైస్కూలు స్థాయిలో దానిని వినియోగించి తెలివితేటలను పెంచుకునేలా చూడాలి. భేషజాలకు పోకుండా కన్సల్టెంట్ల సేవలను తీసుకోవాలి. మన ఆలోచనల కంటే వారి సూచనలు వాస్తవికంగా ఉంటాయి. ఒకప్పుడు డిఈఓలు తరచూ స్కూళ్లను తనిఖీ చేసేవారు. ఎంఈఓలు కూడా ఇతర పనులు చేస్తున్నారు తప్ప విద్యాప్రమాణాలు పెంచే ప్రయత్నం జరుగటం లేదు. స్కూళ్లలో వకృత్వ పోటీలు జరిగేవి. విద్యార్థులను పిక్నిక్ లకు తీసుకెళ్లేవారు. ఎక్సకర్షన్లు ఉండేవి. ప్రైవేటు స్కూళ్లలో ఇవన్నీ జరగుతున్నాయి. వచ్చే తరం పిల్లలకు మనం ప్రపంచస్థాయి విద్యను అందించగలిగితేనే వాళ్లు పోటీ ప్రపంచంలో మనగలగుతారు. ఈ విషయాన్ని గుర్తించి సమూల మార్పులకు బాట‌లు వేయాలి అని మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ ఇ వెంకట నర్సింహారెడ్డి, అదనపు డైరెక్టర్ లింగయ్య, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరిలు పాల్గొన్నారు.
*  *  *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles