Loans in Congress Goverment | అప్పులపై కాంగ్రెస్ అబద్దాల తిప్పలు
పార్లమెంటు సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ బండారం
మహాకుంభమేళ తరహాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో ముందున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Hyderabad : రాష్ట్రంలోని అప్పులపై కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా అవి పటాపంచలువుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అప్పులపై కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం పార్లమెంటు సాక్షిగా బయటపడిందని తెలిపారు. రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4. 42 లక్షల కోట్లు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అయినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని రెండింతలు చేసి రూ 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం తన సహచర ఎమ్మెల్సీలతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలని సూచించారు. అబద్దాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. గత 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భారీ అప్పులపై ప్రజల దృష్టిని మళ్లించడానికి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ నాటకాలకు తెరలేపారని ఆమె మండిపడ్డారు.
కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్నదానిలో వాస్తవం లేదని, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన సభలో చెప్పారని, మరి ఆ ప్రాజెక్టులను వినియోగించుకొని సాగుకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నా కూడా పంతానికి పోయి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీళ్లు మిగిలిస్తున్నదని విమర్శించారు. నీళ్లు ఇవ్వగలిగి అవకాశం ఉండి.. ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా ? అని ఆమె నిలదీశారు. ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుగుతుందని, మహాకుంభమేళ తరహాలో జరగబోయే రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు.
ఇక శాసన మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించిందని, సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామని ఎమ్మెల్సీ కవిత వివరించారు. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని, ప్రజలు, రైతులు, మహిళలు వంటి అన్ని సమస్యలపై గళమెత్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతీ రోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలియజేశామని, కేసీఆర్ పై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపామని గుర్తు చేశారు. ఫీజు రియింబర్స్ మెంట్ పై మేము చేసిన పోరాటానికి దిగొచ్చిందని, ఎప్పటికప్పుడు ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా సీఎం ప్రకటించారని, ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
ఈ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని, ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని, ఆ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృష్టి ఫలితం ఎంతో ఉందని వివరించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్ధేశించి పరుషపదజాలంతో సీఎం అసభ్యకరంగా మాట్లాడారని, సీఎం వ్యాఖ్యలు చరిత్రలో నల్ల మరకగా ఉండిపోయిందని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూనే ఉంటామని, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.
* అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు సహకరించండి..
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకరించాలని శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులతో పాటు బండా ప్రకాశ్ ముదిరాజ్ ను కలిసి ఎమ్మెల్సీ కవిత వినతి పత్రం అందించారు. విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత ఇనుమడింపజేస్తుందని, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం బీసీల చిరకాల కోరిక అని తెలిపారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో గతంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఉదాత్తమైన భావాలు చట్టసభల్లో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డిప్యుటీ చైర్మన్ ను కలిసిన వారిలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, కొట్టాల యాదగిరి ,ఎత్తరి మారయ్య, గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , డి కుమారస్వామి , సాల్వాచారి, డి నరేష్ కుమార్ , వంజరి ప్రవీణ్, ఏల్చాల దత్తాత్రేయ , అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన , పుష్ప చారి , మధు, విజయ్ జితేంద్ర తదితరులు ఉన్నారు.
* * *