Dycm Bhatti Vikramark | సంక్షేమం లో తెలంగాణ దేశానికే ఆదర్శం
అన్ని రాష్ట్రాల చూపు తెలంగాణ వైపు
సన్న బియ్యం మరిచిన గత పాలకులు
ఈ పథకం తో 3.10 కోట్ల మందికి లబ్ధి
ఏటా రూ.13,525 కోట్లు కేటాయింపు
రూ.9,000 కోట్లుతో రాజీవ్ యువ వికాసం
జూన్ 2 నుంచి 9 వరకు అనుమతి పత్రాలు పంపిణీ
సన్నధాన్యం బోనస్ కు ఖర్చు రూ. 2,675 కోట్లు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడి..
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన మధిర మండలం, మధిర మున్సిపాలిటీలో వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత పాలకులు 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే వాటన్నిటినీ సరి చేసుకుంటూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు అన్నారు. గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పది సంవత్సరాలపాటు సన్న బియ్యంతో సంగీతం పాడారు.. తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. పేద వర్గాలకు సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదు అన్నారు. సన్నబియ్యంతో అన్నం తినాలని ఆశగా ఎదురు చూసే వారికి గత ఉగాది నుంచి రాష్ట్రంలోని 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు, 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఇవే కాకుండా కొత్తగా రాబోతున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో ఒక కోటి రేషన్ కార్డు దారులకు, 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నిరుపేదలకు సన్న బియ్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 13,525 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. పేద ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, అంకిత భావాన్ని ఈ పథకం తెలియజేస్తుందని అన్నారు. కనీ వినీ ఎరుగని గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని తెలిపారు. గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలను ఈ సందర్భంగా కోరారు.
రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడమే కాదు.. సన్నధాన్యం సాగు చేసే రైతులకు మరోవైపు బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సన్నధాన్యం సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,675 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు రైతు రుణమాఫీ కోసం రూ. 21 వేల కోట్లు, రైతు భరోసా కు రూ.18 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ గా రూ. 2,675 కోట్లు, వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం రూ. 12,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని లెక్కలు వివరించారు. ఇవన్నీ చేపడుతూ తిరిగి పేదలకు సన్న బియ్యం అందించేందుకు రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని యువకులు సాధించుకున్నారని, వారి కలలు నిజం చేసే క్రమంలో ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసాం అని తెలిపారు. మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అని డిప్యూటీ సీఎం తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు రాక మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం రూ. 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త స్వయం ఉపాధి పథకాలను చేపట్టినట్టు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేవరకు క్యాలెండర్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.
వరుస సెలవులు, వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు రాజీవ్ యువ వికాసం గడువును ఏప్రిల్ 14 వరకు పెంచామని, మండల, జిల్లాస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ఎప్పటి వరకు ముందే ప్రకటించినట్టు తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో శాంక్షన్ లెటర్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
* * *