Friday, July 4, 2025

MLC Kavita – Rail Roko | బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముఖ్య నేతల మౌనమెందుకు

MLC Kavita – Rail Roko | బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ముఖ్య నేతల మౌనమెందుకు
బీసీల ఓట్లు కావాలి కాని వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు వద్దా
మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లోనే రిజర్వేషన్లపై స్పష్టతనివ్వాలి
రైల్ రోకోకు ప్రతి ఒక్కరూ మద్దతునివ్వాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరించిన క‌విత
Hyderabad : బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనేతలు ఎందుకు నోరు విప్పడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 17న తలపెట్టిన రైల్ రోకో పోస్టర్ ను గురువారం ఆమె తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టి పాస్ చేసిందన్నారు. ఈ బిల్లులు నెలల తరబడి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నా కాంగ్రెస్ అగ్రనేతలు వాటిపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో స‌మాధానం చెప్పాలన్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో సభ్యులుగా ఉన్నా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ అంశంపై మాట్లాడలేదన్నారు. బీసీల ఓట్లు కావాలి కాని.. వాళ్లకు రిజర్వేషన్లు వద్దా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు చట్టరూపం దాల్చేందుకు మద్దతునివ్వాలని కోరుతూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖ‌ర్గేకు లేఖ రాశానని తెలిపారు. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈనెల 8వ తేదీలోపు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
వ‌చ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీని సమాయత్తం చేయడానికి ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వస్తున్నారని విమ‌ర్శించారు. బీసీ రిజర్వేషన్లు తేలకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్లపై తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్ కమిటీ ఆధ్వర్యంలో చేయించిన కులగణన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ బుధవారమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు లేఖ రాశానని తెలిపారు. ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకొని బీసీ బిల్లులకు ఆమోదం తెలిపేలా చేయాలని.. తద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించాలని సూచించారు.
*ఢిల్లీకి వెళ్లే ప్రతి రైల్ ను ఆపేస్తాం..
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కోసం ఈనెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని గుర్తు చేశారు. ఆ రోజున ఢిల్లీకి వెళ్లే ప్రతి రైల్ ను ఆపేస్తామని తేల్చిచెప్పారు. రైల్ రోకోకు ప్రతి ఒక్కరూ మద్దతునిచ్చి విజయవంతం చేయాలని కోరారు. దక్కన్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను ఆపి బీసీ రిజర్వేషన్ల సెగ ఢిల్లీకి తగిలేలా చేయాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసమే చేపట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. లేఖలు రాస్తే ప్రాజెక్టును ఆపలేరని.. రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారని కూడా ఆయన అన్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న సంగతి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఎత్తి చూపారని అన్నారు. తెలంగాణ హక్కులను కాలరాసే ఈ ప్రాజెక్టుపై ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు చేయాలన్నారు. రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతునిస్తుందా అనే ప్రశ్నపై స్పందిస్తూ.. తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని.. రైల్ రోకోకు బీఆర్ఎస్ మద్దతునిస్తుందని అన్నారు. యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles