Thursday, March 13, 2025

CM Revanth Reddy | బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు ప్ర‌తిప‌క్షాలు అడ్డు

CM Revanth Reddy | బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు ప్ర‌తిప‌క్షాలు అడ్డు
42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డానికి తెలంగాణ‌లో పునాది రాయి వేశాం
ఐఐహెచ్‌టీకి కొండ ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పేరు పెట్టుకున్నం
ప‌రిశీల‌న‌లో అసిఫాబాద్ మెడిక‌ల్ కాలేజీకి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పేరు
Hyderabad : రాష్ట్రంలో బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎరేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో పునాది రాయి పడిందని అన్నారు. ఆదివారం న‌గ‌రంలో నిర్వ‌హించిన 17 వ అఖిల భారత పద్మశాలి, 8 వ తెలంగాణ పద్మశాలి సంఘం మహాసభల్లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశం మొత్తంమీద కులగణన జరగాలని, రిజర్వేషన్ల విషయంలో 50 శాతం గరిష్ట నిబంధనను సడలించాలన్న డిమాండ్ కు అనుగుణంగా మొట్ట మొదటగా తెలంగాణలోనే పునాదిరాయి పడిందని అన్నారు. “ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కులగణన చేపట్టాం. దానిపై కొందరు కావాలని తప్పుల తడక అని విమర్శిస్తున్నారు, కాని తప్పులెక్కడ ఉన్నాయో చెప్పడం లేదు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు వస్తే పరిపాలన బీసీల చేతుల్లోకి వెళుతుందని, వారి హక్కులను కాలరాయాలని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడుతా. రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా పిల్లల భవిష్యత్తు, వృత్తుల కోసం, వాటిలో నైపుణ్యం పెంచుకోవడం వంటి ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీ హక్కులలో గట్టిగా సమిష్టిగా నిలబడండి“. సీఎం పేర్కొన్నారు.
స్వర్గీయ కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేశార‌ని, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి(IIHT) సాధించుకోవడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టుకున్నామ‌ని, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలన్న విజ్ఞప్తిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంద‌ని సీఎం తెలిపారు. అలాగే తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో పద్మశాలీల పాత్ర మరువలేనిద‌న్నారు. ఈ రోజు అనేక మందికి రాజకీయ నిలువనీడనిచ్చింది పద్మశాలీలే. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకు కూడా ఈ ప్రభుత్వం అంతే ప్రాధాన్యతనిస్తుంద‌న్నారు.
రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులకు ఏటా రెండు నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించామ‌ని,. అందుకు అవసరమైన 1 కోటి 30 లక్షల చీరలను తయారు చేసే బాధ్యత పద్మశాలీలకు అప్పగించాలని నిర్ణయించామ‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు, కరెంటు బకాయిలు, బీమా డబ్బులను ఈ ప్రభుత్వం చెల్లించింద‌ని పేర్కొన్నారు.
సోలాపూర్‌లో పద్మశాలీ సోదరులే అక్కడ స్థిరపడ్డార‌ని, అక్కడ మార్కండేయ భవన నిర్మాణం కోసం 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నామ‌న్నారు. సోలాపూర్, బీవాండి, వర్లి వంటి అనేక ప్రాంతాల్లో మన సిరిసిల్ల సోదరులు స్థిరపడిన‌ట్లు పేర్కొంటూ బీసీలు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సమిష్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తో పాటు పద్మశాలీ నేతలు పాల్గొన్నారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles