Thursday, March 13, 2025

KTR- BRS Working President | రాష్ట్ర భూముల తాకట్టు

KTR- BRS Working President | రాష్ట్ర భూముల తాకట్టు
భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితి
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు అప్పులు
రూ. 30వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం
నాడు భూములు అమ్మొద్దని సుద్దులు, నేడు అమ్మకానికి టెండర్లు
నిధుల సమీకరణ పేరుతో అడ్డికి పావుశేరుకు భూముల అమ్మకం
స‌ర్కారుపై ధ్వ‌జ‌మెత్తిన కేటీఆర్
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణ‌ను సిఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రూ. 30వేల కోట్ల నిధుల సమీకరణ కోసం తాజాగా హైదరాబాద్ లోని విలువైన భూములను అడ్డికి పావుశేరు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులో తనఖా పెట్టిన భూములనే వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి ఇది నిదర్శనం అని అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరి లింగపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలో ఉన్న ఈ 400 ఎకరాల భూములను అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్, ఊసరవెల్లి కంటే వేగంగా మాట మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీని మోసం చేసిన రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా, మూసీ కూల్చివేతల వంటి తలాతోకలేని విధానాలతో రాష్ట్ర ఆదాయం తగ్గి ప్రభుత్వ భూములను అమ్ముకుంటే కాని ఆదాయం సమకూర్చుకోలేని స్థాయికి రేవంత్ సర్కార్ దిగజారిందని ధ్వ‌జ‌మెత్తారు.
తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో ఎన్నో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్రంలో 70 లక్షల రైతులకు రైతుబంధు కింద రూ.73,000 కోట్లు, రూ.28 వేల కోట్ల రుణమాఫీ, రూ.6 వేల కోట్లతో రైతు బీమా, లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు, 45 వేల చెరువుల పునరుద్ధరణ, 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని గతంలో అడ్డగోలుగా మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి, సీఎం అయిన మరుక్షణం నుంచి అప్పు చేయడాన్నే పరమావధిగా పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కేవలం 15 నెలల పాలనలోనే లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పైసలతో తెలంగాణ ప్రజలకు చేసిన ఒక్క మంచి పనినైనా చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలకు ఎగ‌నామం పెట్టి , విద్యుత్ కోతలు విధించి, గురుకులాలను నిర్వీర్యం చేసి, కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను పడావు వెట్టి, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన రాహిత్యంతో శ్రీశైలం సొరంగాన్ని కుప్పకూల్చి, ఏకంగా 8 మంది ప్రాణాలు బలి తీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం రేవంత్ ది అని మండిపడ్డారు.
లక్షల కోట్ల అప్పు చేసినా కూడా తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క పథకం అమలు చేసింది లేదన్నారు. గల్లీలో గాలిమాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, ఢిల్లీకి మాత్రం ధనం మూటలు మోయడాన్నే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ ప్రగతిని కేవలం 15నెలల కాలంలోనే తిరోగమనం బాట పట్టించిన చేతకాని సీఏం రేవంత్ అని కేటీఆర్ మండిపడ్డారు. నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభాండాలు వేసి, నేడు అందినకాడికి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ విరుచుకు ప‌డ్డారు.
  •  *  *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles