Friday, November 14, 2025

Pharma In Telangana | తెలంగాణ‌లో ఫార్మా రంగంలో మరో మైలురాయి

Pharma In Telangana | తెలంగాణ‌లో ఫార్మా రంగంలో మరో మైలురాయి
-తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అమెరికా కంపెనీ
-హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ హబ్
-ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు
– పాల్గొన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Vikasamnews Hyderabad : తెలంగాణ రాష్ట్రం మ‌రో సారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరు పొందిన‌ ఫార్మా దిగ్గజ కంపెనీ `ఎల్ లిల్లీ` కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సీఎం తో పాటు రాష్ట్ర‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ చర్చల అనంతరం ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్ వ‌ర్క్‌ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్ మెంట్‌ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది.
ప్రధానంగా డయాబెటిస్‌, ఓబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్ లో ఈ ఏడాది ఆగస్ట్ లోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ను ప్రారంభించింది. విస్తరణలో భాగంగా ఎల్ లిల్లీ కంపెనీ బారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వ కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles