Chenetha karmikula Dharna | రెండు వారాల‌లో చేనేత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

Chenetha karmikula Dharna | రెండు వారాల‌లో చేనేత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
* లేదంటే న‌వంబ‌ర్ 20న క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముందు మ‌హాధ‌ర్నా
* స‌ర్కారును హెచ్చ‌రించిన మాజీ ఎమ్మెల్సీ చెరుప‌ల్లి సీతారాములు
* తెలంగాణ చేనేత కార్మిక సంఘం స‌మావేశంలో నిర్ణ‌యం
Vikaasam, Hyderabad : రానున్న రెండు వారాల‌లో చేనేత కార్మికుల స‌మ‌స్య‌లు అన్ని పూర్తి చేయ‌క‌పోయిన‌ట్ట‌యితే న‌వంబ‌ర్ 20 చేనేత జౌళి శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముందు మ‌హాధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నామ‌ని, అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామ‌ని మాజీ ఎమ్మెల్సీ చెరుప‌ల్లి సీతారాములు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు వ‌నం శాంతికుమార్ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా చెరుప‌ల్లి ఈ స‌మావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల ఋణమాఫీ చేస్తానని ప్రకటించి దాదాపు ఏడాదిన్నర దాటింద‌న్నారు. ఆయ‌న ఇచ్చిన మాట ప్ర‌కారం ఎప్పుడు రుణ‌ మాఫీ చేస్తారని చేనేత కార్మికులు కండ్లల్లో ఓత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు అని, వారి ఓపికను పరీక్ష వద్ద‌ని హెచ్చ‌రించారు.
పక్షం రోజుల్లో చేనేత కార్మికుల రుణమాఫీ జ‌రుగ‌క పోయిన‌ట్ట‌యితే.. అనుకున్న‌ట్టుగానే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో చేనేత కార్మికులకు, చేనేత చేయూత, నగదు బదిలీ పథకం అమలు చేశార‌ని పేర్కొన్నారు. దాని స్థానంలో చేనేత భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకోని నెలలు గడుస్తున్నా.. ఈనాటి వరకు ఆ హామీని అమలు చేయడం లేదని కాంగ్రెస్ స‌ర్కారుపై మండిప‌డ్డారు.
నేతన్న భీమా పథకంలో వయసుతో నిమిత్తం లేకుండా భీమా ఇవ్వాలని నిర్ణయించినందుకు తాము సంతోషం వ్య‌క్తం చేస్తున్నాం కానీ, చేనేత కార్మికులు మరణించి ఏడాది దాటిన‌ప్ప‌టికీ బీమా అందించక పోవడం చాలా విచారకరమ‌న్నారు. చేనేత ముడి సరుకులైన‌ నూలు, రంగులు, రసాయనాలపై, చేనేత చీరెలపై జీరో జీఎస్‌టీ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని వారు డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు 12 సంవత్సరాల నుండి ఎన్నికలు జరుపలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. చేనేత శాఖ మంత్రి తుమ్మ‌ల‌ నాగేశ్వర్ రావు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి సంవత్సరం దాటింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి, టెస్కోకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని ఈ సంద‌ర్భంగా వారు డిమాండ్ చేశారు. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ ఋణాలు మాఫీ చేసి క్యాష్ క్రెడిట్ రుణాలను పునరుద్దరించాల‌ని డిమాండ్ చేశారు. నేత కార్మికులకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ రంగంలోని ఏక రూప దుస్తులకు చేనేత మాగ్గాల పైన నేసిన వాటినే అందించాలని కోరారు. నేత కార్మికులకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించాల‌ని, హౌస్ కం వర్క్ షెడ్ లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించాలని వారు కోరారు. నవంబర్ 20 వ తేదీన హైదరాబాద్ నాంపల్లి చేనేత కమిషనర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించాలని, ఈ ధర్నాకు చేనేత సంఘాలను, రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని తీర్మానించారు.
రాష్ట్ర కమిటీ సమావేశానికి రాష్ట్ర సలహాదారు బడుగు శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షులు వనం ఉపేందర్, వర్కాల చంద్ర శేఖర్, సహారా నాయకులు శేఖరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ కర్నాటి వెంకటేశం, గజం శ్రీశైలం హాజర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version