HarishRao- Singareni | సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

HarishRao- Singareni | సింగ‌రేణి కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి
  • సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి డైరెక్టర్ గౌతమ్ ను కలిసి వినతి పత్రం అందించిన..
  • మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ నేతలు
Vikasamnews| Hyderabad : బొగ్గుగ‌ని కార్మికుల సమస్యలపై సింగరేణి సంస్థ‌ డైరెక్టర్ గౌతమ్ ను మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వ‌ర్యంలో, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, TBGKS నేతలు కలిసి వినతి పత్రం అందించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు క‌దా ? అని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు అని, ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు అని మండిప‌డ్డారు. వారికి ధర్నా చేసే హక్కు కూడా లేదా ? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా ? ఇదేనా త‌మ‌రు ఇస్తానన్న ఏడవ గ్యారంటీ ? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫుట్ బాల్ మ్యాచ్ కోసం వాడిన రూ.110 కోట్ల పై ఎంక్వయిరీ వేసి, అందుకు బాధ్యుల‌ను బోనులో నిల‌బెడుతామ‌ని హెచ్చ‌రించారు.

* భ‌ట్టీగారు.. మెడిక‌ల్ బోర్డు పెట్టి ఉద్యోగాలు క‌ల్పించండి..
భట్టి విక్రమార్క గారు తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే వారందరితో ప్రజా భవన్ ముట్టడి చేస్తాం మ‌ని హెచ్చ‌రించారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను సింగరేణి డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్‌ పునరుద్ధరించారు అని గుర్తు చేశారు. 40 వేల సింగరేణి ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులే.. వారిని నియమించి ఉద్యోగులను, సంస్థను కాపాడింది కెసిఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు, అలియాస్ పేర్లను కన్సిడర్ చేస్తాం అంటూ హామీలను ఇచ్చి, రెండేళ్లలో రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టారు అని దుయ్య‌బ‌ట్టారు. కార్మికులపై పగపట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అని అన్నారు. కాళ్ళు లేని వారిని, కండ్లు కనిపించని వారిని, గుండెకు బైపాస్ సర్జరీ అయినా వారిని కూడా ఉద్యోగం చెయ్యాలని ఇబ్బంది పెడుతున్నారు అని, ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. కార్మిక కంటక ప్రభుత్వం, కార్మికులను గోసపెట్టుకునే ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం అంటూ హ‌రీశ్‌రావు ఆగ్ర‌హించారు. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని ప్రభుత్వన్ని వారు డిమాండ్ చేశారు.

* ప్ర‌వేటు ప‌రం చేసే కుట్ర‌..
సీఎం రేవంత్రెడ్డి హయాంలో సింగరేణి సంస్థ‌ను ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది అని, కరంట్ కు బొగ్గును తీసుకోని బిల్లులు చెల్లించడం లేదు అని, సింగరేణి అప్పుల పాలయ్యే పరిస్థితి, జీతాలకు డబ్బులు లేక OD తీసుకుని జీతాలు ఇచ్చే వంటి ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రేవంత్ అధికారంలో వచ్చాక రూ.50, 000 కోట్ల అప్పుల్లో సింగరేణి. ఆర్ధిక మంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయడం తగునా భట్టి గారూ అని సూటిగా ప్ర‌శ్నించారు.
* జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం..
జర్నలిస్టులకు కేసీఆర్ 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చార‌ని, రిపోర్టింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు అనే తేడా లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇచ్చార‌ని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అక్రిడేషన్ కార్డులను 10 వేలకు తగ్గించడం దుర్మార్గం మ‌న్నారు. బిఆర్ఎస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణం. జర్నలిస్టుల పోరాటానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుంది.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version