Ponguleti Srinivas | అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు తేడా లేదు

  • Ponguleti Srinivas | అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు తేడా లేదు

  • ఆందోళ‌న వ‌ద్దు.. మీతో నేనున్నా

  • అంద‌రికీ జ‌ర్న‌లిస్టు సంక్షేమ ప‌థ‌కాలు వ‌ర్తిస్తాయి

  • జీవో 252లో మార్పులు చేర్పులు ఉంటాయి

  • త్వ‌ర‌లోనే జ‌ర్న‌లిస్టుల సంఘాల‌తో ప్ర‌త్యేక స‌మావేశం

  • డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు మంత్రి పొంగులేటి

VikasamNews/Hyderabad : జ‌ర్న‌లిస్టు అక్రిడిటేష‌న్ కార్డుల‌కు, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా అక్రిడిటేష‌న్ కార్డుదారుల‌కు వ‌ర్తించే ప్ర‌తి ప్ర‌యోజ‌నం మీడియా కార్డు దారుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని, ఈ విష‌యంలో డెస్క్ జ‌ర్న‌లిస్టులు ఎలాంటి అపోహ‌ల‌కు గురికావొద్ద‌ని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వ‌కంగా ఇస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.
సచివాల‌యంలో మంగ‌ళ‌వారం త‌న‌ను క‌లిసిన టీడబ్ల్యు జేఎఫ్, డెస్క్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ తెలంగాణ ప్ర‌తినిధుల‌తో మంత్రి వివిధ అంశాల‌పై చ‌ర్చించి వారి సందేహాల‌ను నివ్రుత్తి చేశారు.
జ‌ర్న‌లిస్టుల కార్డుల‌పై కొంద‌రు అపోహ‌ల‌కు గురి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అని, వాటిని న‌మ్మ‌వ‌ద్దు అని. ఎలాంటి ప‌క్ష‌పాతం లేద‌ని పేర్కొన్నారు. మీడియా కార్డుల విష‌యంలో జ‌ర్న‌లిస్టులెవ్వ‌రూ ఆందోల‌నకు గురికావొద్దు అని, త‌మ‌తో నేనున్నాను అని అన్నారు. రెండు విభాగాలుగా చూడాల‌న్న ఆలోచ‌న కాద‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని సంక్షేమ ప‌ధ‌కాల‌ను వ‌ర్తింప‌చేస్తామ‌న్నారు. అర్హులైన‌, నిజ‌మైన జ‌ర్న‌లిస్ట్‌ల‌కు మేలు చేయాల‌న్న సంక‌ల్పం, స‌దుద్దేశంతో తీసుకున్నదే ఈ నిర్ణ‌యమ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిన‌హా దేశంలో ఇంత పెద్ద‌మొత్తంలో అక్రిడిటేష‌న్ కార్డులు ఇస్తున్న రాష్ట్రం మ‌రొక‌టి లేద‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే రాష్ట్రంలోని అన్ని జ‌ర్న‌లిస్ట్ సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని, ఆ స‌మావేశానికి డెస్క్ జ‌ర్న‌లిస్ట్‌ల‌ను కూడా ఆహ్వానిస్తామ‌ని అంద‌రి అభిప్రాయాల‌ను, స‌ల‌హాల‌ను సూచ‌న‌ల‌ను తీసుకొని జ‌ర్న‌లిస్ట్‌ల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరే విధంగా జీవో 252లో మార్పులు, చేర్పులు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. టిడ‌బ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయ‌కులు బి. రాజ‌శేఖ‌ర్‌, గండ్ర న‌వీన్ ఆధ్వ‌ర్యంలో మంత్రిగారిని క‌లిసిన వారిలో ఫెడ‌రేష‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఉపేందర్‌, మ‌స్తాన్‌, నాయ‌కులు నిస్సార్‌, విజ‌య‌, రాజారాం, స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ నాయ‌కులు కృష్ణ‌, శ్రీ‌నివాస్ త‌దిత‌రులు ఉన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version