Ramzantofa – Harishrao | రేవంత్ రెడ్డి ‘జూనియర్ యోగి’గా మారాడు
* రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు
* సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర్..
Vikasamnews.com/Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక జూనియర్ యోగా మారాడు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవ చేశారు. ముషీరాబాద్ భోలక్‌పూర్‌లోని అంజుమన్ గర్ల్స్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో T. Harish Rao పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలకు రేషన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్సీ మహహ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మైనార్టీ నాయకుడు సలీం ఇప్పటి వరకు సుమారు 10 వేల రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Rao (కేసీఆర్) హయాంలో పేదల కోసం షాది ముబారక్ పథకం ద్వారా లక్ష రూపాయలు అందించేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకం అమలు కావడం లేదని విమర్శించారు. అదేవిధంగా, ఇమామ్‌లు ,ముజ్జమ్‌లకు వేతనాలు పెంచుతామని, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదని అని విమర్శించారు. మరోవైపు, రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కానీ లక్ష ఇళ్లను కూల్చివేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ( A. Revanth Reddy )బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తగ్గాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రస్తుతం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రంజాన్ పవిత్ర మాసంలో ప్రజలందరి కష్టాలు తొలగాలని ప్రార్థించాలని పిలుపునిచ్చిన హరీష్ రావు, దేశవ్యాప్తంగా ధరలు పెరగడం, గ్యాస్ సిలిండర్ల కొరత వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు.
* * *