Cm Revanth Reddy | అబద్ధాలతో సర్కారు నడుపలేం
55 రోజుల్లో 11000 ఉద్యోగాలు భర్తీ చేశాం
విద్యాలో కింద రెండో స్థానంలో తెలంగాణ
రవీంద్రభారితలో ఎంపికైన 1532 లెక్చరర్లకు నియామక పత్రాలు అందచేసిన సీఎం రేవంత్
Hyderabad : రాష్ట్రంలో “అబద్దాల ప్రాతిపదికన పాలనను (రాష్ట్రాన్ని) నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “విద్యార్థుల భవిష్యత్తుతో పాటు, తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కంకణబద్ధులై పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకమైంది. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి కనబరచలేదు. నియామకాలకు సంబంధించి న్యాయ స్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి వాయిదా పడుతుంటే ఒక్కొక్కటిగా చిక్కుముడులను విప్పుకుంటూ నియామకాలను పూర్తి చేశాం` అని సీఎం రేవంత్ తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నిలిచిన నిరుద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి మాకుందని పేర్కొన్నారు. ఒక్క ఏడాది కాలంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదన్నారు. ఇది తనకు ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం అని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు.
ఇప్పుడు తమకు వచ్చిన ఉద్యోగం కుటుంబ భవిష్యత్తే కాదని, భవిష్యత్తు తరాలను కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలన్నారు. దేశ భవిష్యత్తు విద్యా శాఖతో ముడిపడి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉంది. విద్యా శాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదన్నారు. భవిష్యత్ తరాలకు ఇది పెట్టుబడి అని పేర్కొన్నారు. విద్యలో కేరళతో పోటీ పడి రాణించాల్సిన తెలంగాణ ఈ రోజు కింది నుంచి రెండో.. మూడో స్థానంలోకి పడిపోయిందంటే తెలంగాణ జాతికి అవమానమన్నారు. వాస్తవాలను అంచనా వేసుకుని, వాస్తవాల మీద చర్చించుకుని భవిష్యత్తుకు ప్రణాళికలను తయారు చేసుకున్నప్పుడే తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో అత్యుత్తమ ప్రమాణాలు, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పటికీ అంతగా అనుభవం లేని ప్రైవేటు స్కూళ్లల్లో ఎక్కువ మంది పిల్లలు ఎందుకు చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లతో ఎందుకు పోటీ పడలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోందని, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. ఇది ఆందోళన కలిగించే పరిణామమని, ఇంత ఖర్చు పెడుతున్నా ఫలితాలు సాధించలేకపోతే వృధా అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే దినిపై చర్చించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకోవలసిన అవసరం కూడా ఉందన్నారు. అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేడెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తున్నామన్నారు. అందుకోసం 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని, ప్రతి ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవుతున్నా.. స్కిల్స్ లేని కారణంగా వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నంటిని గమనించే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. క్రీడలు దేశ ప్రతిష్టను పెంచుతాయని, దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ క్రీడల్లో రాణించలేకపోతున్నామని, కోట్లాది ప్రజలున్నా ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోతున్నామని ఆయన మనో వేదనకు గురయ్యారు. విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం గురించి తెలిపారు. ఉద్యోగాలల్లో చేరిన తర్వాత స్కూళ్లు, కాలేజీల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడాకారులను తయారు చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
* * *