Osmania University | న్యాక్ నాలుగో సైకిల్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాం

Osmania University | న్యాక్ నాలుగో సైకిల్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాం
ఓయూ వీసీ ప్రొఫెస‌ర్ కుమార్ వెల్ల‌డి
ఓయూలో ముగిసిన మూడు రోజుల న్యాక్ వ‌ర్క్‌షాపు
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ ఆర్ సుబ్ర‌హ్మ‌ణ్యం
Hyderabad : ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాక్ అక్రిడిటేషన్ నాలుగో సైకిల్ కోసం సన్నద్ధమవుతోందని, రానున్న రోజుల‌లో ఓయూకి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ గుర్తింపు ల‌భించే విధంగా కృషి చేస్తున్నామని ఆ యూనివ‌ర్సిటీ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం అభిల‌షించారు. “న్యాక్ అక్రిడిటేషన్, అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ లెర్నింగ్” అనే అంశంపై ఠాగూర్ ఆడిటోరియంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చేపట్టిన మూడు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా వీసీ మాట్లాడుతూ మూడు రోజుల పాటు విభిన్న అంశాలపై మేధో మధనం జరిగింద‌ని, అధ్యాపకులకు ఇదో నూతన అనుభవాన్నిచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ వ‌ర్క్ షాపు ద్వారా పొందిన జ్ఞానాన్ని తమ పరిశోధనలు, బోధన, అధ్యయనం లో అమలు చేయాలని అధ్యాపకులను కోరారు.
న్యాక్ వ‌ర్క్‌షాపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఐఏఎస్, పథకాలు – విధానాల పరిశోధనా కేంద్రం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యారంగంలో తీసుకురావాల్సిన‌ సంస్కరణలు , వాటి అవశ్యకత, అంతర్గత దృక్కోణాల గురించి వివరించారు. ఆధునిక డిజిటల్ సాంకేతికత ద్వారా బోధన, అధ్యయనంలో నాణ్యత సాధించవచ్చని ఆయ‌న గుర్తు చేశారు.
ఉత్తమ విధానాలను అమలు చేయటం ద్వారా ఉత్తమ గుర్తింపు సాధిస్తామని, ఫలితంగా విద్యాసంస్థ విశ్వసనీయత, శ్రేష్ఠతను సాధిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి అన్నారు. అలాగే బోధన, అధ్యయన ప్రక్రియలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటుందని ఓఎస్డీ ఆచార్య ఎస్. జితెందర్ కుమార్ నాయక్ అభిప్రాయపడ్డారు.
వ‌ర్క్ షాపు విశేషాలు..
ఉస్మానియా యూనివ‌ర్సిటీ న్యాక్ గుర్తింపు ప్రక్రియ కోసం అధ్యాపకులను సన్నద్దం చేసేందుకు న్యాక్ గుర్తింపు ప్రక్రియ, మూల్యాంకనం, ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులు, అధ్యాపకుల సన్నద్ధత, ప్రపంచ విద్యారంగ భవిష్యత్తు ముఖచిత్రం, పర్యవసానాలు, పరిమితులు, అనుకూలతలు, ప్రతికూలతలపై ఆయా రంగాల‌కు చెందిన నిపుణులు ప్రసంగించారు. నిత్య విద్యార్థిగా అధ్యాపకులు కాలానుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకోవాలని విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు విద్యావేత్తలు సూచించారు. దాదాపు పదమూడు వందలకు పైగా ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఈ వ‌ర్క్ షాపులో పాల్గొన్నారు. సంప్రదాయ విద్యావిధానాల నుంచి ఆధునిక, డిజిటల్ విద్యా విధానానికి మారే క్రమంలో ఎదురవుతున్న సవాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌పై పలువురు విద్యావేత్తలు తమ అభిప్రాయాల‌తో పాటు త‌మ‌ ఆలోచనలను పంచుకున్నారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డాటా అనలిటిక్స్ సహా ఆయా రంగాల్లో నైపుణ్యాధారిత విద్య, ఇంటర్న్ షిప్స్, అంకురాల ఏర్పాటు, పరిశ్రమలతో కలిసి పనిచేయటం, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ దృక్పథాన్ని కొనసాగిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా పనిచేయాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. న్యాక్ తో సహా ఎన్ఐఆర్ఎఫ్, అంతర్జాతీయస్థాయిలో ఓయూ ఉత్తమ విద్యా సంస్థగా గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రొఫెసర్ ఉర్మిళ ఎ. పాటిల్, యూపీఎస్సీ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ డి. పి. ఆగర్వాల్, ప్రొఫెసర్ కె. రమ, ప్రొఫెసర్ ఎ. కె. భక్షి, ప్రొఫెసర్ బి రాజశేఖర్, డాక్టర్ టి రవిందర్ రెడ్డి, ప్రొఫెసర్ సామ్రాట్ ఎల్ సబత్, ప్రొఫెసర్ ఎస్ భాస్కర్ పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version