MVL3 Success | మోబైళ్ల‌కు ఇక ట‌వ‌ర్ల‌తో ప‌నిలేదు..

MVL3 Success | మోబైళ్ల‌కు ఇక ట‌వ‌ర్ల‌తో ప‌నిలేదు..
*శాటిలైట్ ద్వారా నేరుగా క‌నెక్టు అవుతుంది
*వాగులు, వంక‌లు, ప‌ర్వాలు, స‌రిహ‌ద్దు ప్రాంతాల‌లో అందుబాటులోకి మోబైల్ సేవ‌లు
* భార‌త‌ను అంత‌రిక్ష శ‌క్తిగా ఈ ప్ర‌యోగం నిల‌బెడుతుంది
* విస్త్రత స్థాయిలో క‌మ్యూనికేష‌న్ రంగం విస్త‌రిస్తుంది
* తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ప్రొఫెస‌ర్ బాల‌క్రిష్టారెడ్డితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..
* * *

Vikasamnews/ Hyderabad : బ్లూబ‌ర్డ్ -6 మిష‌న్ పేరుతో.. భార‌త‌దేశం త‌యారు చేసిన ఎల్‌వీఎం3 భారీ రాకెట్ ద్వారా క‌క్ష‌లోకి పంపి విజ‌య‌వంత‌మైంది అని, ఈ ప్ర‌యోగం వ‌ల్ల ఇక నుంచి సాధార‌ణ మోబైల్ ఫోన్లు నేరుగా అంత‌రిక్ష శాటిలైట్ ద్వారా నేరుగా క‌నెక్టు అవుతాయి అని తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బాల‌క్రిష్టారెడ్డి తెలిపారు. ప‌ర్వ‌తాలు, గ్రామాలు, స‌ముద్రాలు, స‌రిహ‌ద్దు ప్రాంతాల‌లో కూడా మోబైల్ సేవ‌లు నిరాటంకంగా అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు. ఆయ‌న ఏరో స్పేస్ లా ఎక్స్‌ప‌ర్ట్ (నిపుణులు). ప్ర‌స్తుతం ఆయ‌న రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. “బుధ‌వారం భారత్ ప్రపంచానికి కేవలం శాటిలైట్‌ను కాదు.. భవిష్యత్ కమ్యూనికేషన్ శక్తిని అందించింది. భారత అంతరిక్ష సామర్థ్యం ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకుంది.” అని ప్రొఫెస‌ర్ బాల‌క్రిష్టారెడ్డి స్ప‌ష్టం చేశారు.
ఈ రాకెట్ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైన సంద‌ర్భంగా `vikasamnews.com` ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ బాల‌క్రిష్టారెడ్డితో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

*ప్రశ్న : బ్లూబర్డ్-6 ప్రయోగం భారత్‌కు ఎందుకు చారిత్రాత్మకమైనది?
జవాబు: ఈ ప్రయోగంతో భారత్ ప్రపంచ అంతరిక్ష వాణిజ్య రంగంలో అగ్రస్థానంలోకి ప్రవేశించింది. తొలిసారిగా ఒక అమెరికా టెలికాం శాటిలైట్ ను భారత్ తయారు చేసిన LVM3 భారీ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపడం జరిగింది. ఇది భారత అంతరిక్ష సామర్థ్యంపై ప్రపంచ దేశాల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.

* ప్రశ్న : బ్లూబర్డ్-6 శాటిలైట్ ఏం చేస్తుంది?
జవాబు: ఈ శాటిలైట్ ద్వారా సాధారణ మొబైల్ ఫోన్లు నేరుగా అంతరిక్ష శాటిలైట్‌తో కనెక్ట్ అవుతాయి. మోబైల్ టవర్లు అవసరం ఉండ‌దు. ప్రత్యేక ఫోన్లు అవసరం లేదు. ముఖ్యంగా పర్వతాలు, గ్రామాలు, సముద్రాలు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

* ప్రశ్న : ఈ శాటిలైట్ ఎందుకు ప్రత్యేకం?
జవాబు: ఈ శాటిలైట్ ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనికేషన్ యాంటెనాను క‌లిగి ఉంది. ఇది ఒకేసారి వేలాది ప్రాంతాలకు మొబైల్ సిగ్నళ్ల‌ను పంపగలగే సామ‌ర్థ్యం ఉంది. ఇది డైరెక్ట్ సాటిలైట్-టు-మొబైల్ టెక్నాలజీకి విప్లవాత్మక ముందడుగు ప‌డింది.

* ప్రశ్న : అమెరికా కంపెనీ ఎందుకు ఇస్రోను ఎంచుకుంది?
జవాబు: ఎందుకంటే ఇస్రోకు ప్రపంచస్థాయి ఖచ్చితత్వం, న‌మ్మ‌కం, భద్రత, వ్యయసామర్థ్యం వంటి అన్ని ఉన్నాయి. చంద్రయాన్, గగన్యాన్, వన్‌వెబ్ వంటి విజయాల వల్ల LVM3 పై అంతర్జాతీయ నమ్మకం ఏర్పడింది.

* ప్రశ్న : ఈ ప్రయోగం భారత్‌కు ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు: ఇది పూర్తిగా వాణిజ్య ఒప్పందం కింద జరిగిన ప్రయోగం. భారత్‌కు విదేశీ ఆదాయం, కొత్త అంతర్జాతీయ కాంట్రాక్టులు, అంతరిక్ష పరిశ్రమ విస్తరణ లభిస్తాయి.

* ప్రశ్న: ఈ శాటిలైట్ భారత దేశానికి చెందిన‌దేనా ?
జవాబు: నిజంగా చెప్పాలంటే ఈ శాటిలైట్ అమెరికా దేశానికి చెందిన‌ కంపెనీది. కానీ, రాకెట్, ప్రయోగ కేంద్రం, ప్రయోగ బాధ్యత మొత్తం భారత్ దేశానికి చెందిన‌ది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఈ ప్రయోగానికి లీగల్ లాంచింగ్ స్టేట్ గా గుర్తింపు పొంది ఉంది.

*ప్రశ్న : ఈ మిషన్ భారత్‌కు చట్టపరంగా ఏం ఇస్తుంది?
జవాబు: ఇది భారత దేశాన్ని ఒక బాధ్యతాయుతమైన అంతరిక్ష శక్తిగా నిలబెడుతుంది. ప్రపంచ అంతరిక్ష చట్టాల ప్రకారం భారత్ ఇప్పుడు అత్యంత విలువైన వాణిజ్య శాటిలైట్‌లను సురక్షితంగా ప్రయోగించగల దేశంగా గుర్తింపు పొందింది.

* ప్రశ్న : భారత్ – అమెరికా సంబంధాలకు దీని ప్రాముఖ్యత ఏంత‌?
జవాబు: ఇది రెండు దేశాల మధ్య ఉన్న అత్యున్నత సాంకేతికత‌పై ఉన్న నమ్మకాన్ని నిరూపిస్తుంది. అంతరిక్ష రంగం భవిష్యత్ వ్యూహాత్మక రంగం. ఇది అందులో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోంది.

*ప్రశ్న : ఈ టెక్నాలజీ భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు: ఇది: సరిహద్దు ప్రాంతాలు, ప్రకృతి విపత్తుల సమయంలో, గ్రామీణ ప్రాంతాలు, సముద్ర, విమాన సేవలు అన్నింటికీ నేరుగా మొబైల్ కనెక్టివిటీని అందించగలదు.

*ప్రశ్న : వికసిత్ భారత్ @2047కు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు: భవిష్యత్ భారత్ అంటే ప్రపంచానికి డిజిటల్ సేవలు అందించే దేశం. ఈ శాటిలైట్ ద్వారా భారత్ గ్లోబల్ డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిస్తోంది.

*ప్రశ్న : ఈ మిషన్ విద్యార్థులకు ఏం చెబుతోంది?
జవాబు: భవిష్యత్ ఉద్యోగాలు:
•అంతరిక్ష సాంకేతికత
•ఉపగ్రహ కమ్యూనికేషన్
•డేటా సైన్స్
• ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)
•స్పేస్ లా వంటి రంగాల్లో వంటి రంగాల్లో విస్త్ర‌త స్థాయిలో అవ‌కాశాలు ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయి టెక్నాలజీ నాయకులుగా ఎదగాలి.

* ప్రశ్న : ఇది ఒక్కసారి జరిగే ప్రయోగమా? మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాంటి ప్ర‌యోగాలు జ‌రుగుతాయా?
జవాబు: ఇది ఒక్క సారి మాత్ర‌మే జ‌రిగే ప్ర‌యోగం మాత్రం కాదు. ఇది భారత్‌ను ఒక గ్లోబల్ స్పేస్ లాంచ్ హబ్‌గా మార్చే ప్రయాణానికి ఆరంభం మాత్ర‌మే. ఇకపై మరెన్నో విదేశీ శాటిలైట్‌లు భారత్ నుంచే ప్రయోగం కానున్నాయి.
* * *

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version