BRS Leader KTR | తెలంగాణలో బాగా పెరిగిన ప్రభుత్వ అణచివేత

BRS Leader KTR | తెలంగాణలో బాగా పెరిగిన ప్రభుత్వ అణచివేత
బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. ఈ అంశంపై స్పందించాలని డిమాండ్
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అరాచకత్వం, దమనకాండ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పాత్రికేయులను సైతం అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కే తార‌క రామారావు మండిప‌డ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి గొంతునూ బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను కూడా విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వందలాది ఎకరాల పచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన హక్కుని అణచివేస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈ విధంగా జరుగుతున్న అరాచకత్వానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ దేశంలోని ప్రతి పట్టణానికి వెళ్లి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తారని, కానీ తెలంగాణలో తమ సొంత పార్టీ పాలనలో జరుగుతున్న అరాచకత్వంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఇప్పటికైనా పక్కన పెట్టి, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలన చేసేలా తమ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని ఆయ‌న‌ రాహుల్ గాంధీకి సూచించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టు భేషరతుగా విడుదల చేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ డిమాండ్ చేశారు.
అయితే హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఉన్న వంద‌ల ఎక‌రాల భూమిని ప్రైవేటు వ్య‌క్తుల‌కు ప్ర‌భుత్వం క‌ట్ట‌బెడుతుంద‌ని, దానిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన ఆ యూనివ‌ర్సిటీ విద్యార్థులు పోలీసులు అరెస్టు చేసి, పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో విద్యార్థుల‌కు మ‌ద్ధ‌తుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. అరెస్టు అయిన విద్యార్థుల‌ను ఆ పార్టీ నాయ‌కులు ద‌గ్గ‌ర ఉండి విడిపించారు. అయితే సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమిని కాపాడ‌డంలో భాగంగా చేప‌ట్టిన విద్యార్థుల ఆందోళ‌న నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు దానిని సీరియ‌స్‌గా తీసుకున్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version