Harish Rao | ఛార్మినార్ వ‌ద్ద భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న హ‌రీశ్‌రావు

Harish Rao | ఛార్మినార్ వ‌ద్ద భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న హ‌రీశ్‌రావు
-దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న మాజీ మంత్రి హ‌రీశ్‌
– గ‌తంలో మ‌త సామ‌ర‌స్యాల‌కు ప్ర‌తీక‌గా హైద‌రాబాద్ ఉండేది
– రాష్ట్రంలో కొన‌సాగుతున్న గుండాల రాజ్యం
– రాష్ట్రంలో అగ్రిక‌ల్చ‌ర్ పోయి.. గ‌న్ క‌ల్చ‌ర్ వ‌చ్చింది
– కాంగ్రెస్ స‌ర్కారుపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం..
Vikasam Hyderabad : దీపావళి పండుగ సంద‌ర్భంగా మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఛార్మినార్ వ‌ద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దీపావళి పర్వదినం చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మతసామరస్యానికి ప్రతీకగా ఉండేద‌న్నారు. చార్మినార్ లో భాగంగా అమ్మవారి దేవాలయం ఉండడం హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం వంటి సాంప్రదాయాలు ఉన్న గొప్ప సంస్కృతి మనది కొనియాడారు. హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈసంద‌ర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింద‌న్నారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఉంద‌ని, ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. స్వయాన ముఖ్యమంత్రే రేవంత్‌రెడ్డియే హోం శాఖ మంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయి అని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైంద‌ని మండిప‌డ్డారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
* రాష్ట్రంలో రాజ్య‌మేలుతున్న గుండాల రాజ్యం..
రాష్ట్రంలో శాంతిభద్రతలు తగ్గిపోయి గుండాల రాజ్యం ఏర్పడింద‌ని, ప్రజల ప్రాణ మానాలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొని అభివృద్ధిలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. క్యాబినెట్లో ఏం జరిగిందో తాను చెప్పాల్సిన పనిలేద‌ని, ఆ విష‌యాన్ని స్వయంగా మంత్రి కుమార్తెనే చెప్పింద‌ని దుయ్య‌బ‌ట్టారు. గన్ను ఎవరు తెచ్చారు.. అనేదానిపై సమాధానం చెప్పాల‌న్నారు. తుపాకులు పెట్టి అక్రమార్జన చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం స్పందించలేద‌ని విమ‌ర్శించారు. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేసి నిజానిజాల నిగ్గు తేల్చాల‌ని. క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఇవి అని, మీరు నిజంగా తప్పు చేయలేదు అంటే విషయాలు బయటకు తేవాల‌న్నారు. తప్పులు చేయకపోతే పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లారు? అని గ‌ట్టిగా నిల‌దీశారు. హైదరాబాద్‌ను గుండా రాజ్యాంగా మార్చార‌న్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధాయంగా మారిస్తే కాంగ్రెస్ వ‌చ్చి.. తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఈ రోజు.. త‌మ‌రు పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడానికి త‌మ‌లో తామే త‌న్నుకు చస్తున్నారా? అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్ వ‌చ్చి అగ్రికల్చర్ ని పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చి గన్ కల్చర్ ని పెంచింద‌ని ఎద్దేవ చేశారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version