B R Ambedkar Open University | విద్యార్ధుల డేటా బేస్ కు అపార్ ఐడీ కీలకం

B R Ambedkar Open University | విద్యార్ధుల డేటా బేస్ కు అపార్ ఐడీ కీలకం
అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్‌ ప్రొ ఘంటా చక్రపాణి
స్కాలర్‌షిప్‌ల‌కు అపార్ ఐడీలు తప్పనిసరి
అపార్ ఐడీ అమలులో తెలంగాణాలో అంబేద్కర్ వర్శిటీకి మొదటి స్థానం
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు
అంబేద్కర్ వర్సిటీలో “అపార్ అమలు” అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభం

Hyderabad : విద్యార్ధుల డేటా బేస్ నమోదు, విద్యా సంబంధిత విషయాలు ఒకే దగ్గర నమోదు అయి ఉండాలన్నా, దేశ వ్యాప్తంగా ఆ విద్యార్ధి అకాడమిక్ సంబంధ విషయాలు అన్నీ ఒకే దగ్గర నమోదు చేయడానికి “ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ తప్పని సరి అని డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ ఘంటా చక్రపాణి అన్నారు. డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి.ఎస్.టి.డీ), తెలంగాణ ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో “అపార్ అమలు” అనే అంశంపై సోమ, మంగళవారాలు రెండు రోజులు నిర్వహించనున్న వర్క్ షాప్ ను ఆ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం – 2020 లో భాగంగా యూజీసీ మార్గదర్శాకాల ప్రకారం అపార్ ఐడీ లను రూపొందించడంలో జాతీయ స్థాయిలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి దేశంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo 75 శాతం విద్యార్ధులకు అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ క్రియేట్ చేశారని వివరించారు.
విద్యార్ధులకు అడ్మిషన్ సమయంలోనే అపార్ ఐడీ ఆవశ్యకతను వివరిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చామని, విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్, కంప్యూటర్ సెంటర్ సిబ్బంది ఎప్పటికప్పుడు విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేస్తూ రికార్డు స్థాయిలో అపార్ ఐడీ లు నమోదు చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా ప్రయత్నం చేశామని దీంతో ఎక్కువ శాతం విద్యార్ధులు అపార్ ఐడీ పొందేలా చేశామని వెల్లడించారు. విద్యార్ధి ఒక విద్యా సంస్థ నుంచి ఇంకో విద్యా సంస్థకు మారాలన్నా, ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్ కు మారాలన్నా చాలా సులువుగా మారే అవకాశం ఉందని, అలాంటి సమయంలో విద్యార్ధి వివరాలను ఒకే దగ్గర నుంచి చాలా సులభంగా పొందొచ్చన్నారు.

ఈ కార్యక్రమానికి సిఎస్‌టీడి డైరెక్టర్ డా పరాంకుశం వెంకటరమణ మాట్లాడుతూ సదస్సు నిర్వహణ ఆవశ్యకతను వివరించారు. విద్యార్ధులు అపార్ ఐడీ రూపొందించడంతో వారికీ ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లను పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతీ స్కాలర్షిప్ లేదా విద్యా సంబంధిత విషయంలో ఎలాంటి ఆర్ధికపరమైన సహాయం పొందాలన్న రానున్న రోజుల్లో విద్యార్ధికి అపార్ ఐడీ తప్పనిసరి అని వివరించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (న్యూఢిల్లీ) అధికారులు రోహిత్ సింగ్, రోహిత్ కశ్యప్, రవి పాండే తదితరులు పాల్గొని అపార్ (APAAR)ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ముగ్గురు ప్రతినిధుల చొప్పున, కళాశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల నుంచి 60 మంది ప్రతినిధులు హాజరు కాగా వీరికి ఈ సదస్సులో రెండు రోజుల పాటు అపార్ ఐడీ ఎలా రూపొందించాలి, దాని ప్రాముఖ్యత ఏమిటి, సాంకేతిక సమస్యలను ఏ విధంగా అధిరోహించాలి అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version