Telangana Eapcet-2025 | ఈ నెల 25 నుంచి ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తుల షురూ..

Telangana Eapcet-2025 | ఈ నెల 25 నుంచి ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తుల షురూ..
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు ఏప్రిల్ 4 వ‌ర‌కు గ‌డువు
అల‌స్య రుసుంతో ఏప్రిల్ 24 వ‌ర‌కు గ‌డువు
వివ‌రాలు వెల్ల‌డించిన ఎప్‌సెట్ క‌న్వీన‌ర్ డీన్ కుమార్‌Hyderabad : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కాలేజీల‌లో ప్ర‌వేశాల కోసం 2025-26 విద్యా సంవ‌త్స‌రం కోసం నిర్వ‌హించే ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ డీన్ కుమార్ గురువారం ప్ర‌క‌టించారు. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌న్ తో పాటు షెడ్యూల్ గ‌తంలోనే విడుద‌లైంది. అయితే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఏప్రిల్ 4 వ‌ర‌కు కొన‌సాగుతుంది. షెడ్యూల్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తుల అనంత‌రం త‌ప్పుల స‌వ‌ర‌ణ‌కు ఏప్రిల్ 6 నుంచి 8 వ‌ర‌కు మూడు రోజులు గ‌డువు విధించారు. రూ. 250 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ. 500 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 14 వ‌ర‌కు, రూ. 2500 ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 18 వ‌ర‌కు, రూ. 5 వేల ఆల‌స్య రుసుంతో ఏప్రిల్ 24 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

* ఏప్రిల్ 29 నుంచి ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు..
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మ‌సీ, అగ్రిక‌ల్చ‌ర్ కాలేజీల‌లో ప్ర‌వేశాల కోసం ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షల‌ను కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈఏడాది కూడా ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. తెలంగాణతో పాటు ఏపీలోని కర్నూల్‌, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
ప్ర‌స్తుతం ప్ర‌వేశాల‌లో అమలులో ఉన్న 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాను రద్దు కానుంది. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణకు చెందిన విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లను 70 శాతం కన్వీనర్‌ కోటాలో, 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడిన ప‌రిస్థితి ఉంది. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన గడువు పదేండ్లు గతేడాదితో పూర్తకావ‌డంతో నాన్‌లోకల్‌ కోటా గడువు కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని పూర్తి సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే దక్కనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version