Wallclock in inter exam centers | ఇంటర్ పరీక్షలలో గడియారాల పంచాయతి
రిస్టు వాచ్‌లకు అనుమతి నిరాకరణ
గోడ గడియారాల ఏర్పాటు ఇంటర్ బోర్డు నిర్ణయం
ఒక్కొక్క వాల్‌క్లాక్‌కు రూ.100 కేటాయింపు
సరిపోవు అంటున్న కాలేజీ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు
ఇరకాటంలో ఇంటర్ బోర్డు అధికారులు..
Hyderabad : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలలో గోడ గడియారాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్ణయించింది. సోమవారం ఉదయం పరీక్షలు ప్రారంభమయ్యే వరకు అన్ని పరీక్ష కేంద్రాలలో గోడ గడియారాలు సిద్ధంగా ఉంచాలని బోర్డు కార్యదర్శి అన్ని ప్రాంతీయ ఇంటర్మీడియట్ విద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు శనివారం బోర్డు సెక్రెటరీ క్రిష్ణ అదిత్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పరీక్ష గదులలో గోడ గడియారాలు ఏర్పాటుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని, కాకపోతే గడియారానికి ఒక్కొక్క దానికి రూ.100 కేటాయించిన బోర్డు.. తమరే కొనుగోలు చేసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. దీంతో ఒక్కొక్క వాల్ క్లాక్‌కు రూ.100 సమంజసంగా లేదని, ఈ డబ్బులకు నాణ్యమైన వాల్‌క్లాక్ రాదని పేచీ పెడుతున్నారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డు అధికారులు పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నారు. దీంతో గడియారాలకు సంబంధించి కొత్త పంచాయతీ తెరపైకి రావడంలో బోర్డు అధికారులు నివ్వెరపోతున్నారు. ఇప్పటికప్పుడు 1.53 లక్షల గోడగడియారాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో తెలియని పరిస్థితిలో అధికారులు పడ్డారు. దీంతో ఇంటర్ బోర్డులో కొత్త పంచాయతీ మొదలైంది.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను రిస్టు వాచ్‌లు అనుమతించలేదు. దీంతో విద్యార్థులకు పరీక్ష సమయం గురించి అవగాహన కొరవడుతుంది. అయితే పరీక్షల నేపథ్యంలో ప్రతి అర గంటలకు ఒక సారి పరీక్ష కేంద్రాలలో గంట కొడుతారు. అలాగే ఇన్విజిలేటర్లు కూడా సమయం ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
అయితే ఈ విధంగా చాలా పరీక్ష కేంద్రాలలో పాటించడం లేదు. పైగా రిస్టు వాచ్‌లు పరీక్షలకు తీసుకెళ్లడం లేదు. దీంతో పరీక్ష సమయం తెలియక విద్యార్థులు సతమతవుతున్నారు. పరీక్షలకు సరిగా రాయలేని దుస్థితి ఏర్పడింది. దాని ఫలితంగా ఇంటర్‌లో ఫెయిల్ కావడం, లేదా మార్కులు తగ్గడం, దాని ఫలితంగా జేఈఈ పరీక్షలలో పర్సంటేల్ తగ్గిపోవడంతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో సీట్లు కోల్పోయే వంటి పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో విద్యార్థులతో పాటు తల్లదండ్రులు రిస్టు వాచ్‌లను అనుమతి నిరాకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే రిస్టు వాచ్‌లకు అనుమతి లేక పోవడంతో ప్రత్యామ్నయంగా పరీక్ష కేంద్రాలలో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 1532 పరీక్ష కేంద్రాలలోని పరీక్ష గదులలో వాల్‌క్లాకులు తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి కేంద్రంలో కనీసం 10 లెక్కిస్తే.. 1.53లక్షల గోడ గడియారాలు అవసరం ఉన్నట్లు తేలింది.
* * *