Telangana Nims Hospital | నిమ్స్‌లో యువకుడి గుండె మార్పిడి స‌క్సెస్‌

Telangana Nims Hospital | నిమ్స్‌లో యువకుడి గుండె మార్పిడి స‌క్సెస్‌
ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స.. కోలుకుంటున్న పేషెంట్
డాక్టర్లను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచన
Hyderabad : రాష్ట్రానికి చెందిన తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న 19 ఏండ్ల యువకుడికి, నిమ్స్ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెత్ అయిన మరో యువకుడి గుండెను, ఈ 19 ఏండ్ల హైదరాబాద్ యువకుడికి విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ, డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలోని డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ టెక్నీషియన్ల బృందం శుక్రవారం శస్త్ర చికిత్సను పూర్తి చేసింది.
హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన పూజారి అనిల్‌కుమార్ కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. నిమ్స్‌ హాస్పిటల్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన 24 ఏండ్ల యువకుడు, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అయితే అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఆ యువకుని బ్లడ్ గ్రూపునకు, అనిల్‌కుమార్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. దీంతో హార్ట్‌ను నిమ్స్‌కు తరలించి, డాక్టర్ అమరేశ్‌ బాబు నేతృత్వంలోని వారి టీమ్‌ అనిల్‌కుమార్‌‌కు అమర్చింది. ఆరోగ్యశ్రీ కింద అనిల్‌కుమార్‌‌కు ఉచితంగా అవయవమార్పిడి చికిత్స చేశామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప వివరించారు.
నిమ్స్‌లో గతేడాది 62 మందికి కిడ్నీ, నలుగురికి లివర్, ఇద్దరికి హార్ట్, ఒకరికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశామని, ఈ ఏడాది 16 మందికి కిడ్నీ, ఒకిరికి లివర్, ఒకరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేశామన్నారు. ( 2024, 2025లో కలిపి మొత్తం 87 ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేశామ‌న్నారు). గతేడాది నిమ్స్‌లో ఒక వ్యక్తికి హార్ట్, లంగ్ రెండూ ఒకేసారి ట్రాన్స్‌ప్లాంట్ చేశామని బీరప్ప తెలిపారు. దేశంలోని ప్రభుత్వ దవాఖాన్లలో, ఒక్క నిమ్స్‌లో మాత్రమే ఇలా ఒకేసారి హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం జరిగిందన్నారు.
అనంత‌రం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్ డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
అవయవమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కూడా పేషెంట్ల బాగోగులను పర్యవేక్షించాలని, వారికి అవసరమైన వైద్య సేవలను కొనసాగించాలని ఆయన సూచించారు. నిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను మరింత విస్తరించాలని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గాంధీ హాస్పిటల్‌లో త్వరలోనే అధునాతన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. యువకుడికి గుండెన్ దానం చేసిన డోనర్ కుటుంబ సభ్యులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవదానానికి ముందుకు వచ్చి, ప్రాణదాతలుగా నిలవాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. అవయవదానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జీవన్‌దాన్ ఇంచార్జ్‌, డాక్టర్ భూషణ్ రాజు మంత్రి సూచించారు. అవయవ మార్పిడి విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. వయవదానానికి సంబంధించిన కొత్త నిబంధనలను అమలు చేయబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అవయవాల అక్రమ రవాణా, సేకరణ, మార్పిడికి కఠిన శిక్షలు పడేలా కొత్త నిబంధనలు ఉండబోతున్నాయని మంత్రి హెచ్చ‌రించారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version