Telangana Assembly | రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా

Telangana Assembly | రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా
ప్ర‌పంచ దేశాల‌తో పోటీ విధంగా డెవ‌ల‌ప్‌చేస్తా
విద్యార్థుల‌లో నైపుణ్యం కొర‌వ‌డింది
హాస్ట‌ల్ విద్యార్థులు డైట్‌, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం
రాష్ట్ర అసెంబ్లీలో సీఏం రేవంత్‌రెడ్డి వెల్ల‌డి

Hyderabad : తెలంగాణ రాష్ట్ర అభివ్రుద్ధికి తాను శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తాన‌ని, ప్ర‌పంచ దేశాల‌తో పోటీ ప‌డే విధంగా ఈ ప్రాంతాన్ని డెవ‌ల‌ప్ చేస్తాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ప్రజల మన్ననలు పొందే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి క్రుషి చేస్తాన‌న్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలను వారి సీనియారిటీ ప్రకారం ఏడాదిలోగా వంద శాతం చెల్లిస్తామని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన ప్రాధాన్యతతో ముందుకు వెళుతోందని, అందుకు ప్రజా ప్రతినిధులతో పాటు ఉద్యోగులు అందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రసంగంపై రెండు రోజులుగా సాగిన చర్చకు శాసనమండలి, శాసనసభల్లో సీఎం సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వానికి వచ్చే సహేతుకమైన సలహాలను తప్పకుండా స్వీకరిస్తామన్నారు. వాస్తవాలను వివరిస్తూ పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వం జవాబుదారిగా ఉంటుంద‌న్నారు. “గడిచిన 15 నెలలుగా ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల ప్రాతిపదికగానే ఆయా అంశాలను గవర్నర్ ప్రసంగంలో చేర్చాం. గవర్నర్ గారి ప్రసంగంపై సభలో వచ్చే సూచనలు, సలహాలను బడ్జెట్‌లో ప్రతిబింబించే ప్రయత్నం చేస్తాం. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడుపదలుచుకోలేదు. ప్రజలకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ ఆలోచన” అని సీఎం వివ‌రించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా, పెట్టుబడులను తెచ్చి, వీలైనంత మేరకు సంక్షేమం, అభివృద్ధి చేస్తూ, పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయంతో ఆలోచనలు చేస్తున్నామ‌న్నారు . రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆదాయ వివరాలను తెలియజేస్తూ, ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ.. పనిచేస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది చెప్పారు. బీసీ కులగణన అవసరం, ఆవశ్యకత, జరిగిన తీరును సమగ్రంగా వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక ప్రాతిపదిక కావాలని, అందుకోసం చిత్తశుద్ధితో కులగణన చేశామని వివరించారు. బీసీ సబ్‌ ప్లాన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామ‌ని వివ‌రించారు.
తెలంగాణలో వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే రైతులను రుణ విముక్తులను చేయాలని రెండు లక్షల రుణ మాఫీ చేశామ‌ని పేర్కొన్నారు. అలాగే, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పంట కొనుగోలు, సన్నవడ్లకు బోనస్, రైతాంగ సమస్యల పరిష్కారానికి రైతు కమిషన్ ఏర్పాటు వంటి రైతులకు తోడ్పాటును అందించే కార్యక్రమాల గురించి సోదాహరణగా వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేసిన చర్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయ‌న పేర్కొన్నారు.
విభజన తర్వాత రాష్ట్ర నీటి వాటా సాధనకు ఎలాంటి ప్రయత్నాలు జ‌రిగాయో వివరించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి వాటా కోసం చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాల గురించి తెలిపారు. గత పదేళ్ల కాలంలో నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ వాటా దక్కించుకోవడంలో ఎలా విఫలమైందీ ప్రాజెక్టుల వారిగా ముఖ్యమంత్రి వివరించారు. మహిళల సాధికారత కోసం చేపట్టిన పనుల ఒక్కొక్కటిగా సమగ్రంగా వివరించారు. అలాగే గత పదేండ్లలో విద్యా రంగ పరిస్థితులను విడమరుస్తూ, విద్యా రంగ అభివృద్ధికి 15 నెలలుగా ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సభముందు ఆవిష్కరించారు. పదేళ్లుగా నిర్వీర్యం చేసిన యూనివర్సిటీలను తిరిగి జీవం పోయడానికి చేసిన ప్రయత్నాలను చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించని పరిస్థితులను అధ్యయనం చేసి సాంకేతిక నైపుణ్యం పెంచాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన, క్రీడాభివృద్ధికి ప్రత్యేకంగా యూనివర్సిటీ స్థాపన, క్రీడాభివృద్ధికి ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాలతో ఒప్పందాలు, దశాబ్దాలుగా మూస పద్ధతిలో నడుస్తున్న ఐటీఐలను ఆధునిక సాంకేతికత జోడించి ఏటీసీలుగా మార్చుతున్న విధానాలను తెలియజేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజారిందని చెప్పారు. దాని ప్రతిష్టను కాపాడటానికి తీసుకున్న చర్యల గురించి తెలియజేశారు. పేపర్ లీకేజీలతో అప్రతిష్టపాలైన పరిస్థితి నుంచి ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ పోటీ పరీక్షలను నిర్వహిస్తూ, ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 57 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు. తెలంగాణ నిరుద్యోగ రేటు కూడా తగ్గిందని గణాంకాలు వివరించారు.
విద్యా రంగాన్ని పట్టించుకోని కారణంగా గత పదేండ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తగ్గిపోయిందని, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి డీఎస్సీ నిర్వహించి 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు పదోన్నతులు కల్పించడం, బదిలీల ప్రక్రియ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలను మెరుగుపరచడానికి అవసరమైతే చట్ట సభల్లో ప్రత్యేకంగా చర్చ చేసి అవసరమైన చర్యలను తీసుకుందామని అన్నారు. పూర్తి నిర్లక్ష్యంలోకి నెట్టబడిన గురుకులాల్లో ఏండ్ల కొద్ది పెంచని డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెప్పారు. నిరంతరం రాష్ట్ర రక్షణలో నిమగ్నమవుతున్న పోలీసు కుటుంబాల పిల్లల కోసం సైనిక్ స్కూల్ తరహాలో ప్రత్యేక స్కూల్‌ను ప్రారంభించడం వంటి అనేక చర్యలను వివరించారు. రాష్ట్రం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని, దేశ ప్రధానమంత్రి తో సహా ఢిల్లీ వెళ్లి అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు, నిధుల గురించి అడిగిన వివరాలను సభ ముందు పెట్టారు. ఏఏ మంత్రులను కలిసిందీ ఏ ఏ ప్రాజెక్టుల కోసం సహకరించాలని కోరిందీ విడమరిచి చెప్పారు. హైదరాబాద్ చారిత్రాత్మక లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి 20 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన విషయాన్ని చెప్పారు. వరంగల్‌కు విమానాశ్రయం సాధించినట్టుగానే ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ విమానాశ్రయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.
2022 లో ఉభయ సభల్లో రాష్గ్ర గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారని, 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా అలాంటి ప్రయత్నం జరుగ‌గా, న్యాయస్థానం జోక్యంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ ప్రసంగానికి అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చిదని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదని హిత‌వు ప‌లికారు. రాజ్యాంగ సంస్థలైన కేంద్రం, గవర్నర్, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ… రాష్ట్రాలు అన్నింటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని వ్యవస్థలను గౌరవించుకోవాలని చెప్పారు. ప్రజాస్వామిక సంప్రదాయాలకు కట్టుబడి తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చిన సభ్యులందరికీ సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version