Telangana Power | రాష్ట్రంలో 17,162 మెగావాట్ల గరిష్టానికి చేరుకున్నవిద్యుత్ సరఫరా
తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి రికార్డు
అయినా ఇబ్బందులేకుండా నాణ్య మైన విద్యుత్ సరఫరా చేస్తున్న సర్కార్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి..
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ కు చేరుకున్నప్పటికీ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తుందని డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క గురువారం తెలిపారు. రాష్ట్రంలో 17,162 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ కు చేరడం రాష్ట్ర చరిత్రలో కొత్త రికార్డు నెలకొందన్నారు. 2023-24లో (2024 మార్చి 8న) గరిష్టంగా 15,623 మెగావాట్ల డిమాండ్ మాత్రమే నమోదు కాగా, తెలంగాణ పవర్ యుటిలిటీలు 2025 మార్చి 20న సాయంత్రం 4:39 గంటలకు 17,162 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ కు చేరిందన్నారు. 2023 డిసెంబర్ నుండి ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యల ఫలితంగా వేసవి కాలంలో మరింత పెరిగే విద్యుత్ డిమాండ్ ను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని, విద్యుత్ ఉత్పత్తి పెంచడం, ప్రసార, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టిందన్నారు.
పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ కార్యాలయాల కార్యకలాపాలు పెరుగడంతో గత సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్ ఈ వేసవిలో భారీగా పెరిగిందన్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం అన్ని వర్గాల వినియోగదారులకు, వ్యవసాయానికి కూడా నిరంతరంగా విద్యుత్ ను నాణ్యతగా సరఫరా చేస్తున్నామమని ఆయన పేర్కొన్నారు.
TGGENCO, TGTRANSCO, TGSPDCL, TGNPDCL ఉద్యోగులందరూ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంలో నిరంతరం పని చేస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగులందరూ వినియోగదారులకు నిరంతరంగా, నాణ్యమ ఐన విద్యుత్ సరఫరా అందించడానికి మరింత అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
* * *