Prime Minister MODI | అభ‌యార‌ణ్యంలో ప‌ర్య‌టించిన పీఎం మోడీ

Prime Minister MODI | అభ‌యార‌ణ్యంలో ప‌ర్య‌టించిన పీఎం మోడీ
కెమెరాల‌తో ఫోటోలు తీస్తు అడ‌విని ఆస్వాధించిన పీఎం
వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ మ‌న అంద‌రిద‌ని పిలుపు
ప్రాజెక్టు ల‌య‌ర్ కోసం రూ.2900 కోట్లు మంజూరు

Hyderabad : భార‌త‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం ప్రపంచ వన్యప్రాణులన్న అట‌వీ ప్రాంతాన్ని ఆస్వాదించారు. వ‌న్య ప్రాణుల దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో జునాగఢ్ జిల్లాలోని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఆస్వాదించారు. ఆదివారం రాత్రి గిర్ జాతీయ ఉద్యానవనంలో ఉన్న రాష్ట్ర అటవీ శాఖ అతిథి గృహం సింగ్ సదన్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఆదివారం రాత్రి విశ్రాంతి తర్వాత సోమవారం ఉదయం జంగిల్ సఫారీకి వెళ్ళారు. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
ప్రధాని మోదీ సఫారీలో వెళ్తుండగా నేషనల్ పార్క్‌లో సింహాలు సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ కనిపించాయి. ఆ దృశ్యాలను తన చేతిలోని కెమెరాలో బంధిస్తూ.. ఫోటోలు తీస్తూ ముందుకు సాగారు. మధ్యలో ఒకచోట జీపు ఆపించి ప్రధానమంత్రి పలాష్ పువ్వులు కోశారు. అయితే వసంత కాలంలో మాత్రమే ఈ పువ్వులు విరబూస్తాయి. ఈ విశేషాలను చెప్తూ వన్యప్రాణులను సంరక్షించి, వాటి వైవిధ్యాన్ని కాపాడాలని ప్రధానమంత్రి ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వ‌న్య ప్రాణుల బాధ్య‌త మ‌న అంద‌రిదీ..
ఈ భూమిపై జీవవైవిధ్యం, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత మన అంద‌రిపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘ఈ రోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా, ఈ భూమి అద్భుతమైన జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మన అంకితభావాన్ని ప్రకటిద్దాం’ అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులు కావాల్సిన‌ అవసరం ఎంతైనా ఉంద‌ని పిలుపునిచ్చారు. ఈ జాతుల భవిష్యత్తును రక్షించి, వన్యప్రాణులను కాపాడటంలో భారతదేశం చేస్తున్న కృషిని గర్విస్తున్నామ‌న్నారు.
ప్రాజెక్ట్ లయన్ కోసం రూ.2900 కోట్లు మంజూరు..
గుజరాత్‌ రాష్ట్రంలోని గిర్ జాతీయ ఉద్యానవనంలో ఆసియా సింహాలకు సంబంధించిన ప్రాజెక్ట్ లయన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2900 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల‌తో ఆసియా సింహాల సంరక్షణ పనులు జరుగుతాయి. ప్రస్తుతం ఆసియా సింహాలు కేవలం గుజరాత్‌లోనే ఉండ‌డం విశేషం. అయితే ఇవి 9 జిల్లాల్లోని 53 తాలూకాల్లో దాదాపు 30 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివాసంతో జీవిస్తున్నాయి. జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాలియాలో వన్యప్రాణుల కోసం ఒక ‘జాతీయ రిఫెరల్ సెంటర్’ కూడా నిర్మిస్తున్నారు. అలాగే వన్యప్రాణులను ట్రాక్ చేయడానికి గిర్ నేషనల్ పార్క్‌లో ఒక పర్యవేక్షణ కేంద్రంతో పాటు ఒక‌ ఆసుపత్రిని నిర్మించారు. లయన్ సఫారీ ఆస్వాదించాక జాతీయ వన్యప్రాణి బోర్డు (NBWL) ఏడవ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. జాతీయ వన్యప్రాణి బోర్డులో CDS, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, NGO ప్రతినిధులు, వన్యప్రాణి అధికారులు, రాష్ట్ర కార్యదర్శులతో సహా మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు. సమావేశం తర్వాత, ప్రధాని మోదీ గిర్ జాతీయ ఉద్యానవన మహిళా ఉద్యోగులతో కూడా సీఎం సమావేశమయ్యారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version