Telangana RRR Works | రెండు నెల‌ల్లో త్రిపుల్ ఆర్ ప‌నులు ప్రారంభం

Telangana RRR Works | రెండు నెల‌ల్లో త్రిపుల్ ఆర్ ప‌నులు ప్రారంభం
రెండున్నర ఏండ్ల‌లో మామునూరు విమాన‌శ్ర‌యం ప‌నులు పూర్తి
తెలంగాణ‌లో పెండింగ్ ప‌నుల‌పై కేంద్ర మంత్రులు హామీ
వెల్ల‌డించిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
1) రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం,
2) శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (NH-765),
3) పర్వత్ మాల పథకం క్రింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీ,
4) సిఆర్ఐఎఫ్ సేతుబంధు పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీ,
5) NH 65 లోని హైదరాబాద్-విజయవాడ విభాగం 6 లేనింగ్ మరియు NH 163 లోని హైదరాబాద్ – మన్నెగూడ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయ‌డం
కేంద్ర మంత్రుల‌కు కోరిన రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి
Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో రీజ‌న‌ల్ రింగ్ రోడ్లు ప‌నులు రానున్న 2 నెల‌ల్లో పెండింగ్ అంశాలు పూర్తి చేసి, ప‌నులు ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్డ‌రి అన్నారు. ఈ మేర‌కు మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిని గడ్కరీ, రామ్మోహన్‌ నాయుడులను వేర్వేరుగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆ ఇద్ద‌రు మంత్రుల‌తో చర్చించారు. త్రిపుల్ ఆర్ ( RRR)తో పాటు పెండింగ్‌లో ఉన్న ఇత‌ర పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ మేర‌కు ఇరువురికి వినతిపత్రాలు అంద‌జేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..భేటీల వివరాలను వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించేలా చూడాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరామ‌న్నారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి గత ఏడాది డిసెంబరు 27న రూ.7,100 కోట్లతో ఐదు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచారు. అటవీ అనుమతులను వేగవంతం చేయాలని, ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయాలని గడ్కరీని కోరాం. చౌటుప్పల్‌-అమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి మీదుగా నిర్మిస్తున్న దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని విన్నవించాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
అలాగే ‘‘హైదరాబాద్‌-శ్రీశైలం 187 కిలోమీటర్ల రహదారిలో అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం మీదుగా 62 కిలోమీటర్ల ఎలివేటెడెట్‌ కారిడార్‌ నిర్మించాలి. అటవీ ప్రాంతం కావడంతో అనుమతుల్లేక ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలివేటెడ్‌ కారిడార్‌ సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని మంత్రి గడ్కరీని కోరిన‌ట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌తోపాటు.. సోమశిల కేబుల్‌ బ్రిడ్జికి టెండర్లను ఆహ్వానించేందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. ‘‘పర్వతమాల కింద తెలంగాణకు ఎటువంటి ప్రాజెక్టులు లేవు. ఈ నేపథ్యంలో.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్లు, భువనగిరి కోటకు కిలోమీటరు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌ కొండకు రెండు కిలోమీటర్లు, నాగార్జునసాగర్‌ ఆనకట్ట మీదుగా.. నాగార్జునకొండను కలుపుతూ ఐదు కిలోమీటర్లు, మంథనిలోని రామగిరి కోటకు రెండు కిలోమీటర్ల రోప్‌వే ప్రాజెక్టులను మంజూరు చేయాలి’’ అని విజ్ఞ‌ప్తి చేశారు.
అలాగే సీఆర్‌ఐఎ్‌ఫ-సేతుబంధు పథకం కింద రూ.887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరు చేయాలన్నారు. దీనిపై గత ఏడాది జూన్‌ 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారని ఈ సంద‌ర్భంగా మంత్రి కోమట్‌రెడ్డి గుర్తుచేశారు. అయితే అవి పెండింగ్‌లోనే ఉన్నాయని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేతుబంధన్‌ పథకం కింద ప్రతిపాదిత 12 ప్రాజెక్టులు మంజూరు చేయాలని గడ్కరీని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-65పై ట్రాఫిక్‌ విపరీతంగా ఉందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దానిని ఆరులేన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి గడ్కరీ స్పందిస్తూ.. రెండు ప్యాకేజీలుగా మచిలీపట్నం వరకు ఈ రహదారిని విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్‌కు వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భూసేకరణ కోసం రూ.205 కోట్లను మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే 15 రోజుల్లో భూసేకరణ ప‌నులు పూర్త‌వుతాయ‌ని తెలిపారు. అయితే రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌లో మామునూరు విమానాశ్రయాన్ని పూర్తిచేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చిన‌ట్లు రాష్ట్ర మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version