International Women Day | మహిళా సంఘాలకు రైస్ మిల్లులు
గురుకులాలకు మహిళా సంఘాల నుంచి పౌష్టికాహారం సరఫరా
కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా మహిళా సంఘాలను తీర్చిదిద్దుతాం..
మహిళా సంఘాల బలోపేతంతోనే 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
ఇందిరమ్మ శక్తి.. ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తిగా తీసుకుంటా…
పంట ఎండినా.. ప్రమాదాలు జరిగినా పైశాచిక ఆనందం పొందుతున్న బీఆర్ఎస్ నేతలు
ఇందిరా మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇందిరా మహిళా శక్తి పాలసీ ఆవిష్కరణ
Hyderabad : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, తాను తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో మహిళా సంఘాల కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాముల్లో నిల్వ చేయడంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పచెబుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసకుంటున్న కొందరు మిల్లర్లు పందికొక్కుల్లా వాటిని కాజేస్తున్నారని, వాటిని తిరిగి ఇవ్వడం లేదని, లెక్కలు చెప్పడం లేదని సీఎం విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణం మహిళా సంఘాలు చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణాలకు అవసరమైన రుణాలు ఇప్పిస్తుందని తెలిపారు. మహిళా సంఘాలు తమ కాళ్ల పై నిలబడినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఒక (1) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సెర్ప్ సీఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు.
*మహిళా సంఘాలకు వెలుగు..
తెలంగాణలో మహిళా సంఘాలకు, ఆడ బిడ్డలకు చంద్ర గ్రహణం తొలగిందని, స్వయం సహాయక సంఘాల మహిళలు మండల కేంద్రాలకు వెళ్లే అవకాశం లేకుండా గతంలో చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆడ బిడ్డలు నిర్ణయం తీసుకొని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశీర్వదించడంతో 15 నెలల కిత్రం ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆడ బిడ్డలు తలెత్తుకొని వెలుగు, స్వేచ్చను చూస్తున్నారన్నారు. పదేళ్ల నాటి పాలనను ఏడాది తమ పాలనను మహిళలు స్వయంగా చూస్తున్నారని సీఎం తెలిపారు. మంత్రులు, అధికారులను సమన్వయం చేసి సంఘాలను బలోపేతం చేయాలని తాము నిర్ణయించామని, సంఘాలు బలోపేతమైనప్పుడే తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
*మహిళలకే సోలార్ విద్యుత్ – ఆర్టీసీ బస్సులు..
ఐకేపీ సెంటర్లు నిర్వహించే మహిళలకు గతంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదని, తాము వెంటనే చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను సంఘాలకే అప్పగించామని, గతంలో జత బట్టలు కుడితే రూ.25 ఇస్తే తాము దానిని రూ.75కు పెంచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి సమావేశాలకు భవనాలు ఉండాలని నిర్ణయించి ప్రతి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంఘం భవనానికి అనుమతించి ప్రతి భవనానికి రూ.25 కోట్లు కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అదానీ, అంబానీలు మాత్రమే నిర్వహించే సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాల చెంతకు చేర్చామన్నారు. మహిళా సంఘాలు 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మేలా చేశామన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామంటే అందుకు తమకు ఆడ బిడ్డలపై తమకు ఉన్న నమ్మకమే కారణమన్నారు.
కేసీఆర్ బంధువులు, పెట్టుబడిదారులకే పరిమితమైన ఆర్టీసీ బస్సుల లీజులను తమ బంధువులుగా భావించే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు తాము అప్పగించామన్నారు. మహిళా సంఘాలు ఆర్టీసీ 1000 బస్సులు లీజుకు ఇస్తున్నాయని, ఇవ్వాళే 150 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సంఘాలు అందజేశాయని సీఎం వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌తో మహిళా సంఘాలు పోటీపడేలా హైటెక్ సిటీ పక్కన ఇన్పోసిస్, విప్రో వంటి ప్రముఖ సంస్థల పక్కన మహిళా సంఘాలకు 150 షాపులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ కార్పొరేట్ సంస్థలతో పోటీపడాలని, తాము అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం అభయమిచ్చారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాలు ఉత్పత్తులకు పన్నుల మినహాయింపుతో పాటు ముడి సరకు కొనుగోలుకు అవసరమైన రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ తొలి అయిదేళ్లు తన మంత్రివర్గంలో మహిళలను తీసుకోలేదని, ఈ రోజు మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, సీతక్క మహిళల తరఫున నిలబడి కొట్లాడుతున్నారని, మహిళల పక్షాన మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
* అన్నగా బాధ్యత తీసుకుంటున్న..
మహిళలు పరిపాలనలో భాగస్వాముల కావాలని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చారని, మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపారని సీఎం కొనియాడారు. సంఘాల్లోని మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఆడ బిడ్డల సంక్షేమమే ఎజెండాగా మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇచ్చి మహిళలు తలెత్తుకునేలా చేశామని సీఎం తెలిపారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, వారి సంఖ్యను కోటికి పెంచేందుకు వీలుగా సంఘాల్లో చేరే మహిళల వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించడంతో పాటు 60 ఏళ్లకుపైన ఉన్నవారిని తీసుకుంటామని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు.
మొదటి తరం ఇందిరమ్మను అమ్మ అని పిలిచారని, రెండో తరం ఎన్టీఆర్‌ను అన్నను చేశారని.. ఇప్పుడు రేవంతన్నగా మీరంతా తనను పిలుస్తున్నారని సీఎం అన్నారు. తనను కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారని, అన్న అంటే ఆ కుటుంబాల బాధ్యతను తీసుకోవడమేనని సీఎం భావోద్వేగంతో అన్నారు. ఇది పేగు బంధానికి అతీతమైందని, ఆడ బిడ్డల ఆశీర్వాదంతోనే తాను ఈ రోజు మీ ముందు నిలబడగలిగానని, ఈరోజు తాను తెలంగాణ రాష్ట్ర సీఎంగా నిలబడి మాట్లాడుతున్నాన్నంటే అందుకు ఆడబిడ్డల ఆశీర్వాదమే కారణమన్నారు. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తిని, తాను స్ఫూర్తిగా తీసుకొని కోటి మందిని అభివృద్ధిని పథంలోకి తీసుకెళతానని సీఎం తెలిపారు.
* పైశాచిక ఆనందం ఎందుకు..
ఎస్సెల్బీసీ టన్నెల్ కూలినా, రోడ్డుపై ప్రమాదం జరిగి మనుషులు చనిపోయినా.. ఎండలతో పంటలు ఎండినా బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని. సంబురాలు చేసుకుంటున్నారని సీఎం విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారికి పది నెలల పాలనపై ఏడుపు ఎందుకని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పదేళ్లు పాలనలో ఉన్న వారు తమ అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని, సూచనలు చేయాలని సూచించారు. పైశాచిక ఆనందం ఉన్నోళ్లు బాగుపడిన చరిత్ర ఎక్కడా లేదని, ఏడుపులు ఆపి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కుల గణనలో పాల్గొనాలని సూచించారు. కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేసే దాకా తమ ప్రభుత్వం విశ్రమించదన్నారు.
సభ అనంతరం రూ.22, 793 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును, బీమా, ప్రమాద బీమా పథకాలకు సంబంధించిన రూ.44.80 కోట్ల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు అందజేశారు. పాటల రచయిత చరణ్ కౌశిక్, గాయని మధుప్రియ తదితరులను ముఖ్యమంత్రి సత్కరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్స్ కు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీని ఆవిష్కరించారు. ఇందిరా మహిళా శక్తి సభకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న వస్తువులు, వాటి మార్కెటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారిణి, మహిళా జర్నలిస్ట్ జలజ, తెలంగాణ సాంస్కతిక సారథి వెన్నెల రచించిన పాటలను ఆయన ఆవిష్కరించారు. సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* * *