Telangana Health Budget | వైద్య, ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత

Telangana Health Budget | వైద్య, ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత
రాజీవ్ ఆరోగ్యశ్రీకి సమృద్ధిగా నిధులు కేటాయిస్తాం
వైద్య, ఆరోగ్య శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర‌
Hyderabad : పేద, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్యారోగ్య శాఖకు బ‌డ్జెట్‌లో నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత క‌ల్పిస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ మేర‌కు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు పలు సూచనలు చేశారు. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరణ చేస్తాం అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కి వ‌చ్చే బడ్జెట్లో త‌గిన‌ నిధులు కేటాయించి, పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు. రానున్న ఏడాది కాలంలో రాష్ట్రంలో వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణం పనులు పూర్తవుతాయని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాంటోరియంలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version